హొసపేటె: అక్షరాస్యతతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, ఉద్యోగం, అభివృద్ధి సాధ్యమని అక్షరాభ్యాస జిల్లా కో–ఆర్డినేటర్ మధుసూధన్ తెలిపారు. టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యక్తులు, సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చదవడం, రాయడం, సమర్థవంతంగా మాట్లాడటం, వినగల సామర్థ్యంలో మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం, ఉపయోగించడం ప్రధానం అన్నారు. దీన్నే డిజిటల్ అక్షరాస్యతగా పేర్కొంటారన్నారు. ఎస్‌డీఎంసీ అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షుడు, టీచర్ శ్రీనివాస్‌రెడ్డి, ఈరప్ప తదితరులు పాల్గొన్నారు.


