హుబ్లీ: సమయం గడిచినా పబ్ నిర్వహిస్తున్న గోకుల్ రోడ్డు ఐస్ క్యూబ్ హోటల్‌పై హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనరేట్ శాంతిభద్రతల విభాగం డీసీపీ శృతి నేతృత్వంలో రాత్రి దాడి చేశారు. నిర్ధిష్ట సమయంలో హోటల్ వ్యాపారాలను ముగించడం లేదని ప్రజలు చేసిన ఫిర్యాదులతో ఉన్న ఫలంగా ఈ దాడి చేసి అక్కడ ఉన్న యువతీ యువకులను బయటకు పంపించి పబ్‌ను బంద్ చేశారు. గోకుల్ రోడ్డు పోలీస్ స్టేషన్‌లో కేసు దర్యాప్తులో ఉంది. నగరంలోని అన్ని హోటళ్లు, పబ్‌లు, వైన్ షాపులను పరిశీలించాలని కొత్త కమిషనర్ భూషన్ బుర్సే సూచన మేరకు ఈ దాడి జరిగింది. ఇకపై ఎవరూ కూడా గడువుకు మించి హోటళ్లు, పబ్‌లను తెరిచి ఉంచరాదని కొత్త కమిషనర్ గట్టి హెచ్చరిక చేశారు.
గురువు స్థానం మహోన్నతం
● ఎమ్మెల్యే నేమిరాజ నాయక్
హొసపేటె: అందరి కంటే గురువు స్థానం మహోన్నతమైనదని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ నాయక్ పేర్కొన్నారు. సోమవారం హగరిబొమ్మనహళ్లి పట్టణంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా పట్టణంలోని వాల్మీకి భవన్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గురువు స్థానం అమూల్యమైనదని ఆయన అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ ప్రపంచానికి ఆదర్శం అన్నారు. విద్య లేకుండా ఏదీ సాధించడం అసాధ్యం. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవితాన్ని నిర్మించుకునే శక్తిని గురువు నుంచి పొందవచ్చన్నారు. ఇంతటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుల బాధ్యత చాలా ముఖ్యమైనది. రూ.50 లక్షల వ్యయంతో గురుభవన్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు మరిన్ని నిధులు అవసరమైతే, ఈ ఏడాదే ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. నందీపుర డాక్టర్ మహేశ్వర స్వామీజీ, హాల సిద్దేశ్వర స్వామీజీ, బీఈఓ జగదీశ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ బోధనలు అనుసరణీయం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య అన్నారు. సోమవారం శ్రీకృష్ణ యాదవ భవనంలో యాదవ సమాజం ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు పెద్దపీట వేశారన్నారు. ఎమ్మెల్సీలు వసంత్ కుమార్, బోసురాజు, శంకరప్ప, నగరసభ మాజీ అధ్యక్షుడు మారెప్ప, తిమ్మప్ప నాడగౌడ, రవీంద్ర, భీమన్న, హనుమంతప్ప, చెన్నారెడ్డిలున్నారు.


