తుంగభద్ర చెంత.. తాగునీటి చింత | - | Sakshi
Sakshi News home page

తుంగభద్ర చెంత.. తాగునీటి చింత

Aug 26 2026 12:06 AM | Updated on Aug 26 2026 12:06 AM

సాక్షి,బళ్లారి: ఒక వైపు ఇప్పటికే తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు నీరు వదిలారు. మరో వైపు నగరంలో మంచినీటి సమస్య మాత్రం రోజురోజుకు జటిలం అవుతోంది. ఇటీవల వేసవిలో అల్లీపురం, మోకా రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని మహానగర పాలికె 15 రోజులకొకసారి కొళాయిలకు మంచినీరు సరఫరా చేసింది. ప్రస్తుతం డ్యాంలోకి నీరు పుష్కలంగా చేరి కాలువలకు నీటిని వదిలినా నగరంలో తాగునీటి సమస్య తీర్చడంపై దృిష్టి సారించకపోవడంతో నగర వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే కొళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తుండటంతో నగర వాసులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నగరంలోని అన్ని వార్డుల్లో ఎక్కడ చూసినా తాగునీటి కోసం జనం హాహాకారాలు చేస్తున్నారు.

ఆచరణలో అమలు మాత్రం శూన్యం

నగర పరిధిలో 24 గంటల పాటు కొళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తామని ఎమ్మెల్యేలు, మేయర్లు చెబుతున్నారే కాని ఆచరణలో మాత్రం అమలు చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా తాము గత నాలుగు నెలల నుంచి ప్రతి నెలా రెండు ట్యాంకర్లు వేయించుకుంటున్నామని ఆయా కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకరుకు రూ.500 నుంచి రూ.1000 చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. డ్యాం నుంచి కాలువలకు నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీటిని శుద్ధీకరించి, నగరంలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో నింపుకుని ఎందుకు కొళాయిలకు సరఫరా చేయడం లేదని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. కాలువలకు నీరు వదిలి రెండు వారాలు కావస్తున్నా వారానికి ఒకసారి నగర వాసులకు నీటిని సరఫరా చేయడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పనులు మానుకోవాల్సి వస్తోంది

నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు కాని, వచ్చినప్పుడు పనులు పక్కన పెట్టి పట్టుకుంటున్నామని, రాత్రిళ్లు నీరు వదిలితే ఆ నీరు కూడా దక్కవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో ట్యాంకర్లకు డిమాండ్‌ ఏర్పడుతోందని, ట్యాంకర్లతో పాటు రక్షిత మంచినీటి కోసం మినరల్‌ వాటర్‌ ప్లాంట్లపై ఆధారపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఆయా కాలనీల్లో ఒక్కో 20 లీటర్ల క్యానును రూ.10 పెట్టి కొనుగోలు చేసుకుంటున్నామని, ఇంటి వద్దకు తీసుకుని వస్తే ఒక్కో క్యానుకు రూ.30లు పెట్టాల్సి వస్తుందని, ఈ లెక్కన ఇంటి అవసరాలు, మంచినీటి కోసం నెలకు కనీసం రూ.1500 ఖర్చు పెడుతున్నామని సామాన్య, మధ్యతరగతి కుటుంబాల మహిళలు మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నగరంలో మంచినీటి సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

డ్యాం నుంచి వదిలిన నీటితో నిండుగా ప్రవహిస్తున్న హెచ్‌ఎల్‌సీ కాలువ

నిండుకుండలా తొణికిసలాడుతున్న తుంగభద్ర డ్యాం

డ్యాం నుంచి ఇప్పటికే కాలువలకు నీరు విడుదల

అయినా 15 రోజులకోసారి

కొళాయిలకు నీటి సరఫరా

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, నగర పాలికె అఽధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement