రాయచూరు రూరల్: కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. మంగళవారం రాయచూరు బైపాస్ వద్ద తక్కువ ధరకు ఆహార పౌర సరఫరాల శాఖ సరఫరా చేసే 2 టన్నుల చౌక డిపో బియ్యాన్ని లారీలో నింపుకుని కృష్ణా గ్రామానికి తరలిస్తుండగా అధికారులు, పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పులిని పట్టి జూకు తరలించండి
హొసపేటె: విజయనగర జిల్లా హంపీ, కొప్పళ జిల్లా కిష్కింధ వద్ద పులి సంచారం కనిపించడం స్థానికుల్లో ఆందోళన కల్గించింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాకింగ్ కెమెరాల్లో పులి సంచార దృశ్యాలు రికార్డయ్యాయి. 3–4 నెలల క్రితం కంప్లి– గంగావతి తాలూకాలను కలిపే బుక్కసాగర వంతెన వద్ద పులి కనిపించింది. పర్యాటకులు, స్థానికులు పులిని చూసినట్లు తెలిసింది. ఏదేమైనా ఈ ప్రాంతంలో పులి సంచరించడం ప్రజల్లో ఆశ్చర్యం, ఆందోళనను రేకెత్తించింది. పీడీఓ బి.గంగాధర్ ద్వారా అటవీ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించి పులిని పట్టుకుని జూకు తరలించాలని గ్రామ సంక్షేమాభివృద్ధి సంఘం అధ్యక్షుడు విరుపాక్షి, హంపీ గైడ్‌లు హులుగప్ప, హనుమంత, నాగమ్మ విజ్ఞప్తి చేశారు.
నిష్పక్షపాత దర్యాప్తు చేయరూ
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినికి హత్యాచారానికి పాల్పడిన నిందితుల అరెస్ట్‌తో పాటు కేసు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూరులో ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే, మంత్రి పరమేశ్వర్, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్ సింగ్‌లను కలిసి విన్నవించారు. అశ్విని మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో 30 రోజుల్లో ముగ్గురు దళితులు హత్యకు గురైనట్లు తెలిపారు. లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, ఎమ్మెల్సీ బోసురాజు, బసనగౌడ బాదర్లి, ఎమ్మెల్యే బసనగౌడ, దళిత నేతలు అంబన్న, మల్లేష్ పాల్గొన్నారు.
తుంగభద్ర ఎడమ కాలువకు రంధ్రం
హొసపేటె: తుంగభద్ర ఎడమగట్టు కాలువ గట్టుకు రంధ్రం(పైపింగ్) ఏర్పడడంతో నీరు వృథాగా పారుతోంది. ఫలితంగా పైపింగ్ పరిమాణం నెమ్మదిగా పెరుగుతుండటంతో కాలువకు ఎక్కడ గండి పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కారటగి–సింధనూరు సెక్షన్‌లో ఎడమ కాలువ గట్టు కుదించుకుపోవడాన్ని గుర్తించి మరమ్మతు చేసిన తర్వాత ఇప్పుడు కెసరహట్టి కే.హంచినాళ గ్రామం వద్ద ప్రధాన కాలువకు రంధ్రం ఏర్పడింది. కాలువ అడుగు భాగం నుంచి నీరు ఉబికి వస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయంపై కెసరహట్టికి చెందిన బీజేపీ యువ నాయకుడు విశ్వనాథ్ మాలిపాటిల్ మాట్లాడుతూ అధికారులు వెంటనే మేల్కొని పైపింగ్ ఏర్పడిన స్థలాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఒత్తిడి చేశారు. లేకుంటే సంభవించే విపత్తుకు అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు.
పర్మినెంట్ చేయాలని ఆందోళన
రాయచూరు రూరల్: జిల్లాలోని హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర హాస్టల్ భోజన కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడారు. సాంఘీక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి రాష్ట్ర సర్కార్ ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.


