రాయచూరు రూరల్: ఆస్తి తగాదాల్లో న్యాయం లభించకపోవడంతో విషం తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించిన ఘటన కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కనకగిరి పోలీస్ స్టేషన్ ముందు మృతదేహాన్ని ఉంచి బైఠాయించారు. మాజీ శాసన సభ్యుడు బసవరాజ్ దడేసూగూరు ఘటన స్థలానికి చేరుకుని మృతుడు బసవరాజ్‌రెడ్డి(40) కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రాత్రంతా ఆందోళన జరిపారు. మరణానికి కారకులైన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్‌కు ఐజీ హర్ష, కొప్పళ ఎస్పీ ఎల్‌ఆర్ రామ్ అరసిద్ధి, విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవి, డీఎస్పీ న్యామగౌడ, సిద్దలింగనగౌడ, సీఐ నారాయణ వచ్చి పరిస్థితిని శాంతింప చేశారు. భవన నిర్మాణానికి సంబంధించి బసవరాజ్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యహబలి సాబ్ బిళికుద్రి కడుతున్న ఇంటి నిర్మాణంలో లోపాలున్నాయని, దానిని నిలిపి వేయాలని బసవరాజరెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు వేసినందుకు బిళికుద్రి కుమారులు హుసేన్ సాబ్, దాదాపీర్, శాబుద్దీన్, ఖాజా బడే నవాబ్ తన భర్తను బెదిరించడంతో మనస్తాపం చెంది తన భర్త బసవరాజ్‌రెడ్డి పొలానికి వెళ్లి విషం తాగాడని, చికిత్స నిమిత్తం బసవరాజ్‌రెడ్డిని ధార్వాడ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడని భార్య రాధిక పేర్కొంది.
పోలీసుల నిర్లక్ష్యంపై
కుటుంబ సభ్యుల నిరసన
కనకగిరి పోలీస్ స్టేషన్ ముందు
మృతదేహంతో బైటాయించి ధర్నా


