రాయచూరు రూరల్ : దేశవ్యాప్తంగా సోమవారం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు జరుపుకుంటుంటే జిల్లా సరిహద్దులోని ఓ గ్రామ ప్రజలు అందరికీ భిన్నంగా తేళ్ల పంచమిని జరుపుకున్నారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లా గురుమట్కల్ తాలూకా కందుకూరు సమీపంలోని కొండమాయి అమ్మవారి సన్నిధిలో తేళ్ల పంచమి సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా వాటి కింద తేళ్లు కనిపించాయి. తేళ్లను పట్టుకోవడానికి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ తేళ్లను చేతితో తాకినా పట్టుకున్నా శరీరంపై పాకించినా అవి కుట్టనే కుట్టవు. అమ్మవారి మహిమతో తేళ్లు భక్తులకు హాని చేయవని భక్తుల విశ్వాసం. విద్యావంతులను వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా ఆ తేళ్లు కుట్టవన్నారు. పంచమి సందర్భంగా భక్తులు పట్టుకున్న తేళ్లను తమ ముఖం, మెడ, నాలుకపై పాకించుకుని ఆనందించారు. ఏటా శ్రావణ మాసంలో పంచమి రోజున పూజలు చేయడంతో తమకన్ని విధాలుగా మేలు జరుగుతుందన్న నమ్మకంతో భక్తులు వేలాదిగా తరలి వచ్చి మొక్కులను తీర్చుకున్నారు.
తేళ్లను తాకితే మంచి జరుగుతుందన్న ధీమా
కొండమ్మవ్వ గుట్టపై తేళ్లను తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. పట్టుకున్నా కరవని వైనం. నాగ పంచమి రోజు నాగులకు నైవేద్యంగా సమర్పించే పాలు, నువ్వులు, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసిన వాటిని తేళ్ల పంచమి రోజు ఆ గుట్టపై ఉంచి పూజలు చేస్తారు. ఈ పూజలు చేసే క్రమంలో తేలును తాకడం ద్వారా తమకు మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. కర్ణాటక రాష్ట్రంలోని పలు గ్రామాల భక్తులు ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఆచారం
వంటిపై తేళ్లను పాకించుకుంటున్న వైనం
యాదగిరి జిల్లా గురుమట్కల్ తాలూకా కందుకూరులో తేళ్ల పంచమి


