హొసపేటె: తుంగభద్ర మండలి నూతన కార్యదర్శిగా శ్రీనివాస్ బైరి సోమవారం మండలి కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు పారదర్శకంగా కోటా నీటి వాటాను అందిస్తామని అన్నారు. ప్రస్తుతం డ్యాంకు వస్తున్న ఇన్‌ఫ్లో నిలకడగా ఉందన్నారు. ఆయకట్టు ప్రజలు, రైతులు నీటి వాడకాన్ని వృథా చేయకుండా కాపాడుకోవాలన్నారు. ప్రస్తుతం డ్యాంలో ఉన్న నీటిని బట్టి ఖరీఫ్ పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. ఇంజనీర్లు, సిబ్బంది కాల్వలో ప్రవహిస్తున్న నీటిని అక్రమంగా వాడుకోకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. నిరంతరంగా కాల్వలపై గస్తీ చేపట్టాలన్నారు. అధికారం స్వీకరించిన అనంతరం నూతన మండలి కార్యదర్శికి మండలి ఎస్‌ఈ ఆస్మా కాటూన్, ఈఈ చంద్రశేఖర్, మండలి ఇంజనీర్లు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు ఆయన సీడబ్ల్యూసీఆర్ అండ్ డీ విభాగంలో డైరెక్టర్‌గా పని చేశారు.


