సాక్షి,బళ్లారి: మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతిలో ప్రధాన భూమిక పోషించిన బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్రను మంత్రి పదవి నుంచి తక్షణం తొలగించాలని బీజేపీ ధర్నా చేపట్టింది. సోమవారం జిల్లా బీజేపీ శాఖ, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. అవినీతికి పాల్పడుతున్న నాయకులకు కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాల్మీకి అభివృద్ధి మండలి నిధులు పేద ఎస్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు చేరకుండా అన్యాయం చేశారన్నారు. మండలి నగదును బదలాయించుకున్న కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్ర జైలుకు వెళ్లి వచ్చి, అప్పట్లో మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారని, అలాంటి వ్యక్తిని ప్రస్తుతం ఎలా మంత్రివర్గంలోకి చేర్చుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయిందన్నారు. అవినీతి పరుల నుంచి పర్సెంటేజ్ తీసుకుని వారికి అండగా నిలుస్తున్నారన్నారు. వాల్మీకి మండలిలో అవినీతిపై సమగ్ర తనిఖీ చేయకుండా అవినీతి చేసిన వారికి పదవులు ఇస్తే ఇక న్యాయం ఎప్పుడు జరుగుతుందని నిలదీశారు. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కే.ఎస్.దివాకర్, ఎస్టీ మోర్చా జిల్లాధ్యక్షుడు ధరప్ప నాయక్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు విరుపాక్షిగౌడ తదితరులు పాల్గొన్నారు.
అవినీతిపరుడికి మంత్రిగిరి సిగ్గుచేటు– మాజీ మంత్రి శ్రీరాములు
రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి నాగేంద్రపై 32 కేసులు ఉన్నాయని, అలాంటి అవినీతిపరుడైన నాగేంద్రకు మంత్రి పదవి ఎలా ఇస్తారు? అని మాజీ మంత్రి శ్రీరాములు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ఆయన సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. లోకాయుక్త, ఈడీ, సిట్‌తో పాటు పలు దర్యాప్తు సంస్థలు కేసులు దర్యాప్తు చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవిని సీఎం ఎలా ఇచ్చారని మండిపడ్డారు. అందరిపై కేసులు ఉండవచ్చు, అయితే 32 కేసులు ఉండటంతో పాటు వారంలో ఐదు రోజులు కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంలో ఆంతర్యమేమిటన్నారు. ఆయన చేసిన అవినీతిలో పార్టీ నాయకులకు కూడా వాటా ఉండటంతోనే పదవి ఇచ్చి కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నాగేంద్ర తన పదవికి రాజీనామా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి కూడా విఘాతం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో పేదలైన ఎస్టీల సొమ్ము కాజేసిన వారిలో ఎవరెవరికి ఎంతెంత వాటా ముట్టిందో బయటపెట్టాలన్నారు. నాగేంద్రతో రాజీనామా చేయించకపోతే తీవ్ర పోరాటాలు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, సోమలింగప్ప, మాజీ ఎంపీ సన్నపకీరప్ప, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి మండలి అవినీతికి మూలకారకుడని ఆరోపణ
కలెక్టరేట్ ఎదుట బీజేపీ కార్యకర్తల ఆందోళన


