సాక్షి,బళ్లారి: ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడే వైద్యులు దేవుళ్లతో సమానం అని, అలాంటి వైద్యులను మనందరం గౌరవించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే నారా సూర్య నారాయణరెడ్డి, మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. వైద్యుల దినోత్సవం–2026ను పురస్కరించుకుని నగరంలోని బసవ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. వివిధ రంగాల్లో రాణించిన వారితో పాటు ఇటీవల నీట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారిని సన్మానించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వైద్యుల దినోత్సవం రోజున మాత్రమే వారిని సన్మానించి, గౌరవించడం కాకుండా, నిత్యం వారి సేవలను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైంది, డబ్బుల కోసమే పని చేయకుండా సేవాదృక్పథంతో పని చేయాలని వైద్యులకు సూచించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బీ.కే.సుందర్, యోగానందరెడ్డి, భరత్, మల్లికార్జున, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి ఐఎంఏ బళ్లారి బ్రాంచికి వ్యక్తిగతంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించి అందజేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.


