రైతుల భూములు లాక్కొంటే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

రైతుల భూములు లాక్కొంటే ఊరుకోం

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

సాక్షి,బళ్లారి: దేశానికి వెన్నెముక వ్యవసాయం, వ్యవసాయమే లేకపోతే దేశానికి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, అలాంటి వ్యవసాయ భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కొంటే చూస్తూ ఊరుకునేది లేదని ఎస్‌కేఎం– జేసీటీయూ పోరుబాట పట్టింది. సోమవారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి, ఎస్‌కేఎం–జేసీటీయూ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పలు ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నిర్మాణం కోసం బలవంతంగా భూములను లాక్కొని రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థల కోసం భూకబ్జాలను చేస్తే రైతులు ఎలా జీవించాలని ప్రశ్నించారు. దేశంలోని రైతులు, కార్మికుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ భూములను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే విధానాలను వెంటనే విరమించుకోవాలన్నారు. వ్యవసాయ భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, రైతుల జీవనాధారంతోపాటు దేశ ఆహార భద్రతకు పునాది అని అన్నారు.

వ్యవసాయ భూముల రక్షణకు పోరాటం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పేదలకు రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది ఎవరు పండించిన బియ్యం? అని మండిపడ్డారు. ఏడాది పాటు పంటలను పండించకపోయినా అంత వరకు బియ్యం, ఇతర తిండిగింజలను నిల్వ ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ తిండి గింజలు ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు పండిస్తున్నారో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రైతులు భూములను బలవంతంగా పరిశ్రమల కోసం తీసుకుని రైతుల జీవనాధారాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను, వ్యవసాయ రంగ నూతన విధానాలను, విత్తన చట్టాన్ని, వ్యవసాయ మార్కెట్‌ చట్టాన్ని ఇతర రైతు వ్యతిరేక చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సత్యబాబు, ఏఐయూటీయూసీ అధ్యక్షుడు దేవదాస్‌, కేపీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శివశంకర్‌, రైతు సంఘం నాయకుడు గుర్రళ్లి నాగరాజు, ప్రముఖులు తిప్పేస్వామి, తాయప్ప, ఖాదర్‌, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

బలవంతపు భూసేకరణ చేస్తే ఖబడ్దార్‌

రైతులు, కార్మికుల డిమాండ్లపై పోరుబాట

ఎస్‌కేఎం–జేసీటీయూ నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీ, ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement