సాక్షి,బళ్లారి: నగరంలో పలు ఆలయాల్లో పని చేసిన, చేస్తున్న అర్చక కుటుంబాలకు వస్త్రదానం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని అర్చకుల ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబాలకు వస్త్రాలు అందజేసి, ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి వారసత్వాలను కాపాడటంలో ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న అర్చకులను గౌరవించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ధర్మోరక్షతి రక్షతః అని అన్నారు.
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
హొసపేటె: కొప్పళ నుంచి కర్కిహళ్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లిన ఘటన జరిగింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రాంతంలో రోడ్డు మరమ్మతు పనులు నెమ్మదిగా సాగుతుండటంతో రోడ్డు గుంతలతో నిండిపోయింది. దీని ఫలితంగా వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా ఈ రోడ్డుపై ఒక బస్సు బోల్తా పడిన ఘటన జరిగింది. ఆదివారం కావడంతో విద్యార్థులెవరూ ఈ బస్సులో ప్రయాణించలేదు. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 150 మందికి పైగా విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణిస్తారు. ఈనేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకముందే రోడ్డు మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.


