రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్‌వర్క్ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, వసంత కుమార్‌ను వేర్వేరుగా కలసి వినతిపత్రాలు అందజేశారు. మునిరాబాద్‌లో జరగనున్న ఐసీసీ సమావేశంలో బకాయి వేతనాల చెల్లింపులపై చర్చించాలని కోరారు. ఏడాదిగా పనులు లేకపోవడంతో వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకుని టాస్క్‌వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
నీరు విడుదల చేయిస్తాం
రాయచూరు రూరల్: తుంగభద్ర జలాశయం ఎడమ కాలువకు నీరు విడుదల చేయిస్తామని మాజీ మంత్రి బోసురాజ్ రైతులకు హమీ ఇచ్చారు. ఆదివారం ిసిరవార పరిధిలోని కాలువలను పరిశీలించి మాట్లాడారు. ఈనెల 11వ తేదీన తుంగభద్ర నీటి సలహా సమితి సమావేశం జరగుతుందన్నారు. డ్యాంలో నీటి లభ్యతను బట్టి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయచూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు నీరు అందించేలా అధికారులతో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, అధికారిణి విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన
ప్రాంతాల అభివృద్ధికి కృషి
రాయచూరు రూరల్: అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ తెలిపారు. ఆదివారం మాన్వి తాలూకా అరోలిలోని హులిగమ్మ ఆలయం ముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసన సభ్యులు ఏకతాటిపై ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ముందుకొస్తే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. నూతన చెరువుల నిర్మాణాలకు రూ.5 కోట్లు, రహదారికి రూ.2 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు.
కటకటాల్లోకి ఘరానా దొంగ
హుబ్లీ: ఘరానా దొంగను పోలీసులు కటకటాలోకి నెట్టారు. ధార్వాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఇళ్లలో చోరీలు, ఓ ఆలయంలో దొంగతనం, ద్విచక్ర వాహన చోరీ కేసులో దొంగను ఎట్టకేలకు పోలీసులు బంధించారు. నిందితుడు హుబ్లీకి చెందిన అసిఫ్ కాశింసాబా బేగ్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి ఓ కేసులో రూ.5.04 లక్షల విలువ చేయూ 42 గ్రాముల బంగారు ఆభరణాలు రూ.4,500 విలువ చేసే 20 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.30 వేల విలువైన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, బళ్లారి: విద్యతోనే అభివృద్ధి సాధ్యం. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని కర్ణాటక రక్షణ వేదిక ప్రముఖులు పేర్కొన్నారు. కరవె జిల్లా అధ్యక్షుడు అంగడి శంకరప్ప జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మోకా కర్ణాటక పబ్లిక్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు సమయం వృథా చేసుకోకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు శంకరప్ప, ఉపాధ్యక్షుడు శివకుమార్, తాలూకా కరవే అధ్యక్షుడు పంపనగౌడ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు.
సృజనాత్మకకు వేదిక
హ్యాకథాన్
మండ్య: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడానికి హ్యాకథాన్‌లు ఉత్తమ వేదిక అని కావేరీ టెక్నికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. ఎస్. శ్రీకాంతప్ప అన్నారు. తాలూకాలోని సుందహళ్లి సిఐటి కళాశాల ప్రాంగణంలో కావేరీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్, ర్యాంక్‌బుక్ లెర్నింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి ప్రాక్టికల్ టెక్నికల్ పోటీ (హ్యాకథాన్)ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ టెక్నాలజీకి సంబంధించిన సమస్యలపై సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని ఆయన వివరించారు. హుబ్బళ్లి, ధార్వాడ్, దావణగెరెతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి విద్యార్థులు వచ్చారు.


