కేంద్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

కేంద్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. లోక్‌సభలో ప్రతిపక్షాలకు విలువ లేదు. ఏకపక్ష నిర్ణయాలతో తీర్మానాలు చేస్తున్నారని రాయచూర్‌ లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, విద్యుత చట్టం ఇతర మూడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. ఈ బిల్లులపై చర్చిండానికి అవకాశం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. జంతర మంతర్‌లో జరిగిన అంశాలు కూడా చర్చలకు రాలేదని తెలిపారు. మాజీమంత్రి యన్‌.ఎస్‌,బోసురాజ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాయచూరు యాదగరి, విజయనగర జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించలేదన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.

రామదుర్గలో

బొప్పాయి తోట ధ్వంసం

హొసపేటె: బొప్పాయి మొక్కలను గుర్తు తెలియని దుండగులు నరికివేసిన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గూడెకోట హుబ్లీ పరిధిలో చోటుచేసుకుంది. రామదుర్గ గ్రామం నాగర్‌హునసే రోడ్డులో ఉన్న బొప్పాయి తోటలోకి దుండగులు చొరబడ్డారు. ఛాతీ ఎత్తు వరకు పెరిగిన మొక్కలను గొడ్డళ్లతో నరికివేశారు. రెండేళ్ల క్రితం అప్పు చేసి బొప్పాయి పంట సాగు చేశారు. కాయలు కోతకు వచ్చే దశలో ఉండగా దుండగులు నరికి వేయడంతో రైతులు బోరున విలపించారు. ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ప్యాసింజర్‌ రైళ్లు నడపాలి

రాయచూరు రూరల్‌: కుష్టిగి నుంచి బెంగళూరు, హుబ్లీకి ప్యాసింజర్‌ రైళ్లను నడపాలని రైతు సంఘం అధ్యక్షుడు అందానప్ప డిమాండ్‌ చేశారు. ఆదివారం హుబ్లీలోని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గదగ్‌–వాడి నూతన రైలు మార్గం ప్రారంభమైన నేపథ్యంలో కోప్పళ–కుష్టిగి రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం కుష్టిగి–బెంగళూరు, కుష్టిగి–హుబ్లీ మధ్య ప్రత్యేక ప్యాసెంజర్‌ రైళ్లను నడపాలని కోరారు. కార్యక్రమంలో ముదుకప్ప, బసవరాజ్‌ పాల్గొన్నారు.

స్వదేశీ వస్తువుల

విక్రయ శాల ప్రారంభం

రాయచూరు రూరల్‌: నేటి తరం ప్రజలు ఫ్యాషన్‌ డిజైన్ల దుస్తులకు అలవాటుపడుతున్నారు. పాతకాలం నాటి స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కిల్లే బృహ్మనమఠం శాంతమల్ల శివాచార్యులు సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన స్వదేశీ వస్తువుల విక్రయ శాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఫ్యాషన్‌ డిజైన్ల దుస్తులు మానవ శరీరానికి ఆరోగ్యాన్ని అందించకపోగా, పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వదేశీ వస్తువులు, సహజ పదార్థాలతో తయారైన దుస్తులు వినియోగించాలని సూచించారు.

జనాభా ఆధారంగా

రిజర్వేషన్లు కేటాయించాల్సిందే

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని మాజీ ఎంపీ ఉగ్రప్ప డిమాండ్‌ చేశారు. ఆదివారం రాయచూరు రిపోర్టర్స్‌ గిల్డ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బసవరాజ్‌ బొమ్మై ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో రూ.282.3 కోట్లు నిధులు కేటాయించగా.. ప్రస్తుతం అందులో రూ.80 కోట్లు కోత విధించిందని ఆరోపించారు. ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు వారికి కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగాలను బ్యాక్‌లాగ్‌ పోస్టులుగా గుర్తించాలన్నారు. మిగిలిన ఖాళీలను భర్తీ చేసి ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement