గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్‌

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

హుబ్లీ: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నగరానికి చెందిన నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఫర్దీన్‌, వసీం, మహమ్మద్‌ జోష్‌, మల్లిక్‌ రేహాన్‌ కార్వార రోడ్డు ఎంటీఎస్‌ కాలనీ రైల్వే క్వార్టర్స్‌ బహిరంగ స్థలంలో బ్యాగ్‌లో గంజాయిని పెట్టుకొని విక్రయిస్తుండగా అరెస్ట్‌ చేశారు. పాత హుబ్లీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మరో ఘటనలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. హుబ్లీ ధార్వాడ బైపాస్‌లోని తారిహళ్లి పారిశ్రామికవాడ దగ్గర బొలెరో ఢీకొని ఒకరు మృత్యువాత పడ్డారు. బ్యాడగి తాలూకా కాగినెలె నివాసి మహమ్మద్‌ సలీం(27) మృతుడు. ఖలంధర్‌, మహమ్మద్‌ సలీం వెళుతుండగా కబ్బూరు వైపు నుంచి వచ్చిన బొలెరో అదుపు తప్పి ఢీకొనడంతో బైక్‌ చోదకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స ఫలించక మృతి చెందినట్లు హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కేబినెట్‌లో సీనియర్లకు చోటివ్వండి

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని డీకే శివకుమార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ సేవా దళ్‌ అధ్యక్షుడు కే.లక్ష్మికాంతరెడ్డి బూర్దిపాడు డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందించిన సీనియర్‌ నాయకులకు పార్టీ అగ్రనేతలు, ముఖ్యమంత్రి మంత్రి పదవిని కేటాయించాలన్నారు.

దుర్భిక్ష ప్రాంతంగా ప్రకటించరూ

రాయచూరు రూరల్‌: రాష్ట్రాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించి రైతుల బ్యాంక్‌ రుణాలను రద్దు చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు మరిస్వామి డిమాండ్‌ చేశారు. శనివారం దేవదుర్గ తాలూకాలో ఇంచార్జి మంత్రి అజయ్‌ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు పొలంలో వేసిన పంటలు వర్షాలు లేక వాడుముఖం పట్టాయని, నగర, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తోడు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని కోరారు.

యాదగిరిలో

పాత్రికేయుడు కిడ్నాప్‌

రాయచూరు రూరల్‌: పాత్రికేయుడు కిడ్నాప్‌నకు గురైన ఘటన యాదగిరిలో చోటు చేసుకుంది. శనివారం యాదగిరిలోని లుంబిని పార్కు వద్ద సాగర్‌ దేశాయి స్కూటర్‌పై వెళుతుండగా, అతడిని అడ్డుకుని కారులో తీసుకెళ్లినట్లు తెలిసింది. దేశాయి కిడ్నాప్‌నకు కారణాలు తెలియ రాలేదు. యాదగిరి టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

హుబ్లీ: హుబ్లీ– గదగ్‌ రోడ్డులో పంచగంగా లేఅవుట్‌లోని ఖాళీ స్థలం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హుబ్లీ తూర్పు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, అతడి ఆచూకీ తెలిసిన వారు హుబ్లీ తూర్పు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు. మరో ఘటనలో హుబ్లీ రైల్వే స్టేషన్‌లో అస్వస్థతకు గురైన సుమారు 60–65 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చికిత్స కోసం కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు హుబ్లీ రైల్వే పోలీసుస్టేషనులో సంప్రదించాలని పోలీసులు ఓ ప్రకటనలో కోరారు.

కేకేఆర్‌డీబీ అధ్యక్ష పదవిని కేటాయించాలి

రాయచూరు రూరల్‌: ముఖ్యమంత్రి డీ.కే.శివ కుమార్‌ కేబినెట్‌లో జిల్లాకు మంత్రి పదవి కేటాయించనందున కళ్యాణ కర్ణాటక గ్రామీణ అభివృద్ధి మండలి(కేకేఆర్‌డీబీ) అధ్యక్ష పదవినైనా కేటాయించాలని రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మూడేళ్ల పాటు జిల్లాకు మంత్రి పదవి లేకుండా చేశారని, మరో రెండేళ్ల పాటు ఇతరులకు ఇంచార్జి మంత్రి పదవిని కేటాయించి అన్యాయం చేశారని, దానిని సరి చేయాలంటే కేకేఆర్‌డీబీ అధ్యక్ష పదవిని రాయచూరు జిల్లాకు కేటాయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement