మధ్యంతర బెయిల్‌పై సంబరాలా? | - | Sakshi
Sakshi News home page

మధ్యంతర బెయిల్‌పై సంబరాలా?

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

హుబ్లీ: జెడ్పీ సభ్యుడు యోగేష్‌ గౌడ హత్య ఆరోపణలపై మాజీ మంత్రి వినయ్‌కులకర్ణికి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ జారీ చేయడంతో యుద్ధంలో గెలిచినట్లుగా సంబరాలు చేసుకోవడం మూర్ఖత్వం అని హతుడు యోగేష్‌ గౌడ సోదరుడు గురునాథ్‌ గౌడ పేర్కొన్నారు. ధార్వాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పనిసరిగా తాము హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తాం. దీనిపై తమ న్యాయవాదులతో చర్చిస్తున్నామన్నారు. మాజీ మంత్రి వినయ్‌ కులకర్ణి దోషి అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ మేరకు ఆయన శిక్షకు గురై కారాగృహంలో ఉన్నారు. ఇప్పుడేమో ఆయనకు మధ్యంతర బెయిల్‌ లభించింది. దీన్నే ఆయన మద్దతుదారులు పెద్ద సాహసంలా భ్రమించి సంబరాలు చేసుకోవడం తగదన్నారు. తమ సోదరుడు యోగేష్‌గౌడ హత్యకు న్యాయం దొరికేంత వరకు తమ కుటుంబ పోరాటం ఆగదన్నారు.

హొసపేటె వద్ద సినిమా స్టూడియో

హొసపేటె: కంఠీరవ స్టూడియోస్‌ విస్తరణ లో భాగంగా విజయనగర జిల్లాలోని హొసపేటె పట్టణం సమీపంలో ఒక ప్రభుత్వ భూమిని గుర్తించాం, అక్కడ అద్భుతమైన స్టూడియోను నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని కంఠీరవ స్టూడియాస్‌ అధ్యక్షుడు మహబూబ్‌ పాషా తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బెంగళూరుకే పరిమితమైన సినిమా నిర్మాణ కార్యకలాపాలను వికేంద్రీకరించేలా, తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలో ఉన్న కనవిహళ్లి గ్రామంలో స్టూడియోకు భూమిని గుర్తించామన్నారు. కనీసం 25 ఎకరాల భూమిని మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

సిట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది: మంత్రి

సాక్షి, బళ్లారి: తనపై వస్తున్న ఆరోపణలకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని, అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నాగేంద్ర అన్నారు. గురువారం బళ్లారికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు ఎంతోమందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వారు కూడా మంత్రి పదవుల్లో ఉన్నారని అన్నారు. కరువుతో జిల్లాలో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించారు. ముండ్రిగి నాగరాజు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాదక వస్తువులపై

జాగృతి జాతా

రాయచూరు రూరల్‌ : మాదక వస్తువుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నవయుగ కళాశాల అధ్యక్షుడు విఘ్నేశ్వర్‌ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని విద్యాలయంలో జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ప్రచార జాతా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నేటి తరం యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారు. యువకులు దురలవాట్లకు గురై ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక వస్తువుల సేవనం ఆరోగ్యానికి హానికరంతో పాటు మానసికంగా కుంగిపోతారని అన్నారు. గంజాయి, హఫీం వంటి వాటికి బానిస కారాదన్నారు. జాతాలో విద్యార్థులు పాల్గొన్నారు

అక్రమాలపై దర్యాప్తు ఏదీ?

రాయచూరు రూరల్‌: కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(కేపీఎస్‌సీ) కార్యాలయంలో జరిగిన అక్రమాలపై న్యాయాంగ విచారణ జరిపించాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్‌ చేసింది. గురువారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడి వారి భవిష్యత్తును అంధకారం చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై న్యాయాంగ విచారణ జరపాలని కోరుతూ తహసీల్దార్‌ సురేష్‌ వర్మకు వినతిపత్రం సమర్పించారు

హత్య కేసు నిందితుల

అరెస్ట్‌కు డిమాండ్‌

రాయచూరు రూరల్‌: జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హద్దినాళ వద్ద బుధవారం జరిగిన దళిత, బీఎస్పీ కార్యకర్త భూమానంద హత్య కేసులో నిందితులను అరెస్ట్‌ చేయాలని హైదరాబాద్‌ కర్ణాటక వాల్మీకి సంఘం డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో నేతలు మాట్లాడారు. హత్య చేసిన వారిని కాకుండా ఇతరుల పేర్లను నమోదు చేశారని, వారి పేర్లను తొలగించాలని కోరుతూ ఎస్పీ అరుణాంగ్శు గిరికి వినతిపత్రం సమర్పించారు.

మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లును వెంటనే అమలు చేయాలని అఖిల భారత జనవాది మహిళా సంఘం డిమాండ్‌ చేసింది. పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామంటూ గొప్పలు చెప్పడం మాని బిల్లును జారీ చేయాలన్నారు. జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల విభజన పేరుతో మహిళా బిల్లుకు చెక్‌ పెట్టరాదని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement