రాయచూరు రూరల్: నగరంలోని మైనార్టీ, సాంఘీక సంక్షేమ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ హాస్టళ్లను జిల్లాధికారిణి పూవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రాత్రి ఆమె హాస్టల్‌ను సందర్శించి హాస్టల్‌లోని విద్యార్థినులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్, వార్డెన్ల పని తీరుపై విచారించారు. ఇటీవల సింధనూరు తాలూకాలోని హాస్టళ్లలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆమె తనిఖీ చేశారు. కోడిగుడ్లు, అరటి పండ్లు, ఆహార పదార్థాలు, దుస్తులు, మౌలిక సౌకర్యాలు, వంట గది శుభ్రత గురించి పరిశీలించారు.
కృష్ణమ్మ వరద యథాతథం
● ఆల్మట్టి డ్యాం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
రాయచూరు రూరల్: ఎగువన ఉన్న మహారాష్ట్రలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఆల్మట్టి, నారాయణపుర డ్యాంల నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వదిలారు. ఉత్తర కర్ణాటకలో బెళగావి, బాగల్‌కోటె, విజయపుర, గదగ్, కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. నదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందరాదని అధికారులు ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. రాయచూరు తాలూకా దేవసూగూరు వద్ద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు తాలూకాల్లో అసిస్టెంట్ కమిషనర్ హంపన్న, తహసీల్దార్ సురేష్ తదితరులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నిరాటంకంగా థర్మల్ విద్యుదుత్పత్తి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య కూడా రాయచూరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో అధిక శాతం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆర్టీపీఎస్‌లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే 8 కేంద్రాల నుంచి 1720 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచిన ఈ సమయంలో గత రెండేళ్లతో పోల్చితే 300 బిలియన్ల యూనిట్ల విద్యుత్ వినియోగించడం జరిగింది. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రతి రోజు సోలార్, గాలి మరల విద్యుత్, థర్మల్, హైడ్రో ప్రాజెక్టుల నుంచి అధిక ప్రమాణంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 1720 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఆర్టీపీఎస్‌లోని మొత్తం 8 యూనిట్లకుగాను రెండు యూనిట్లను సాంకేతిక సమస్యతో స్తంభింప చేశారు. ఆరు యూనిట్లలో మాత్ర మే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్టీపీఎస్ నుంచి 1090 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. కాగా రెండు లక్షల టన్నుల మేర బొగ్గు నిల్వ ఉన్నట్లు ఆర్టీపీఎస్ అధికారి రమేష్ తెలిపారు.


