సవదికి తీపి.. హెబ్బాళ్కర్‌కు చేదు | - | Sakshi
Sakshi News home page

సవదికి తీపి.. హెబ్బాళ్కర్‌కు చేదు

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

హుబ్లీ: పోటాపోటీగా జరిగిన డీకే.శివకుమార్‌ మంత్రివర్గ విస్తరణలో అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవది బెళగావి కుందాతో నోటిని తీపి చేసుకున్నారు. సవదికి మంత్రి పదవి దక్కగా దీనిపై ఆశ పెట్టుకున్న పలుకుబడి కలిగిన మహిళా నాయకురాలు, మాజీ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మొత్తానికి శివకుమార్‌ కేబినెట్‌లో బెళగావి జిల్లాకు రెండు స్థానాలు దక్కాయి. ఈ రెండు స్థానాలు చిక్కోడి లోక్‌సభ పరిధిలోకి రాగా, బెళగావి లోక్‌సభకు మొండి చేయి చూపారని ఆ ప్రాంత కార్యకర్తలు అసంతృప్తితో రగిలి పోతున్నారు.

సవదిని వరించిన అదృష్టం

జిల్లాలోని 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాను సవది, లక్ష్మి, అశోక్‌ పట్టణ, మహంతేష్‌ కౌజలిగి మంత్రిగిరి కోసం జోరుగా లాబీయింగ్‌ చేశారు. దీంతో సహజంగానే ఎవరికి మంత్రి పదవి లభిస్తుందన్న కుతూహలం నెలకొనగా, చివరికి లక్ష్మణ సవదికి అమాత్య పదవి దక్కింది. ఇప్పటికే చిక్కోడి లోక్‌సభ పరిధిలోని యమనకమరడి అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే సతీష్‌ జార్కిహోళికి తొలి దశలోనే డీకే.మంత్రి వర్గంలో స్థానం లభించింది. రెండో విస్తరణలో కూడా అదే లోక్‌సభ స్థానం పరిధిలోని అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవదిని మంత్రి పదవి వరించింది.

బెళగావి లోక్‌సభకు మొండిచేయి

రెండు మంత్రి స్థానాలు చిక్కోడి పాలు కావడంతో బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లభించక పోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసే సూచనలు ఉన్నాయి. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న లక్ష్మి హెబ్బాళ్కర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇంతకు ముందు మంత్రిగా పని చేసిన అనుభవం, పార్టీ సంఘటితత్వానికి శ్రమించిన తీరు తనకు లాభిస్తుందని భావించిన ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో మద్దతుదారుల్లో తీవ్ర నిరాశ ఛాయలు అలుముకున్నాయి. దీంతో లక్ష్మి అభిమానులు పలు చోట్ల తమ ఆందోళనను వ్యక్త పరిచి పార్టీ హైకమాండ్‌పై ఆక్రోశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement