ఉత్తమ సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలందించాలి

Aug 4 2026 12:11 AM | Updated on Aug 4 2026 12:11 AM

రాయచూరు రూరల్‌: సహకార సంఘాల బ్యాంకులు వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలని ప్రజాపిత బ్రహ్మ కుమారీస్‌ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత సూచించారు. సోమవారం నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో మస్కి కేంద్రంగా పని చేస్తున్న శ్రీ భ్రమరాంబ పట్టణ సౌహార్ధ సహకార నియమిత (ఎస్‌బీఎస్‌ సహకార) బ్యాంక్‌ వార్షిక సమావేశం నిర్వహించారు. సహకార సంఘాల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న గ్రాహకులు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు పురోగతి సాధిస్తాయని పేర్కొన్నారు. బ్యాంకులకు గ్రాహకులు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. సమావేశంలో సహకార సంఘం అధ్యక్షుడు పంపణ్ణ, చిదానంద, కమల కుమార్‌, వీరేష్‌, బసవరాజ, విశ్వనాథ్‌, గోపాల్‌ రెడ్డి, సిద్దన గౌడ, దిలీప్‌, విశ్వ భూషణ్‌, వేమన్న తదితరులు పాల్గొన్నారు.

10లోపు

నీరు విడుదల చేయాలి

బళ్లారి అర్బన్‌: తుంగభద్ర జలాశయం నుంచి ఈనెల 10వ తేదీలోపు అన్ని సాగునీటి కాలువలకు నీరు విడుదల చేసి, వ్యవసాయ పనులకు అవకాశం కల్పించాలని తుంగభద్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరూర్‌ పురుషోత్తం గౌడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బళ్లారిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అత్యవసరంగా నీటిపారుదల సలహా కమిటీ (ఐసీసీ) సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌, తుంగభద్ర బోర్డు అధికారులు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మోకా చిన్న అంజినప్ప, శ్రీధర్‌, వీరణగౌడ, వీరభద్ర, రాజశేఖర్‌, బసవరాజ్‌ స్వామి, సాగర్‌ గౌడ, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

రుణాలు మాఫీ చేయాల్సిందే..

రాయచూరు రూరల్‌: రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు నరసింహ నాయక్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్ర వర్షాభావంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. నగర, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సౌలభ్యాలు కల్పించాలని సూచించారు.

వృద్ధాశ్రమానికి

మందుల వితరణ

హుబ్లీ: స్థానిక నవ నగర్‌ సిటీ పార్కు సమీపంలోని వివేకానంద వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు శ్రీ విక్కి బాయి ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ బాయి భూరత్‌ మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంట నగరాల్లోని వివిధ ఆశ్రమాలకు ఔషధాలు, నిత్యావసరాలు, వస్త్రాలు తదితరాలను అందజేస్తామన్నారు. సేవలో భాగంగా ఈ సారి ఫధర్మీ జైన్‌ బాయి గుప్త్‌ ఈ మందులకు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ సీనియర్‌ ఉద్యోగి రుద్రయ్య మడివాళయ్య చరంతి మఠ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు బోల్తా..

9 మందికి గాయాలు

హుబ్లీ: వ్యాయువ ఆర్టీసీ సంస్థ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని నవళగుంద తాలూకా అమరగోళ క్రాస్‌ సమీపంలో చోటు చేసుకుంది. హుబ్లీ నుంచి విజయపురకు బయలు దేరిన బస్సులో మొత్తం 38 మంది ప్రయాణిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు టైర్‌ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిసింది. వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యువకులు, అటుగా వెళుతున్న వారు బస్సులోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం గదగ్‌ జిల్లా నరగుంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని సీఐ రవి కుమార్‌, ఎస్‌ఐ జనార్దన్‌ సిబ్బందితో కలసి పరిశీలించారు. వ్యాయువ కేఎస్‌ఆర్టీసీ డీసీ హెచ్‌.రామన్నగౌడర, డివిజన్‌ సాంకేతిక ఇంజనీర్‌ దీపక్‌ జాదవ్‌, ట్రాఫిక్‌ అధికారి శివరెడ్డి, నవళగుంద డిపో మేనేజర్‌ ప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement