● సంతోష్‌లాడ్‌కు
కూడా బెర్తు
సాక్షి బళ్లారి: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర మరోసారి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి నిగమంలో రూ.187 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాగేంద్ర.. తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పని చేసిన ఈయన అవినీతి ఆరోపణలను ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
సండూరు లాడ్‌కు అమాత్య యోగం
బళ్లారి జిల్లా సండూరు పట్టణానికి చెందిన సంతోష్‌లాడ్‌కు మంత్రి పదవి దక్కింది. ఈయన ధార్వాడ జిల్లా కలగటిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. సిద్ధరామయ్య మంత్రి వర్గంలో కూడా మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బళ్లారి జిల్లాలో ఇద్దరికి కేబినెట్‌లో పదవులు దక్కడం చర్చనీయాంశమైంది.
టి.రఘుమూర్తికి జాక్‌పాట్..
చెళ్లకెర రూరల్: చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర ఎమ్మెల్యే టి.రఘుమూర్తికి మంత్రి పదవి దక్కింది. 30 సంవత్సరాల తర్వాత చెళ్లకెరకు మంత్రి స్థానం లభించడం విశేషం. వరుసగా 2013, 2018, 2023 ఎన్నికల్లో టి.రఘుమూర్తి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించారు.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చెళ్లకెర వాల్మీకి సర్కిల్‌లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టాపాసులు పేల్చి స్వీట్లు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 1963 జూన్ 10వ తేదీన చిత్రదుర్గ తాలూకా సురువనూరు ఫిర్కా కడమకట్టె గ్రామంలో జన్మించిన టి.రఘుమూర్తి.. సివిల్ ఇంజనీరింగ్ చదివారు. ఆరంభం నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ప్రజా సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొంది ప్రస్తుతం మంత్రి పదవి దక్కించుకున్నారు.


