బళ్లారి అర్బన్: ప్రముఖ రంగస్థల నటుడు బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రధానం, నాటక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన కర్ణాటక నాటక అకాడమీ అధ్యక్షుడు నాగరాజ మూర్తి మాట్లాడుతూ.. బళ్లారి రాఘవ నాటక రంగం ద్వారా సమాజంలో సాంస్కృతిక విలువలు, మానవతా భావాలను పెంపొందించారన్నారు. రాఘవ సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కె.చెన్నప్ప మాట్లాడుతూ.. కన్నడ, తెలుగు రంగస్థల కళాకారులను గుర్తించి రాష్ట్ర స్థాయి రాఘవ పురస్కారాలు అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. యువ కళాకారులకు శిక్షణ, ప్రోత్సాహం అందించడం అవసరమని తెలిపారు. 2026 రాష్ట్ర స్థాయి రాఘవ పురస్కారాన్ని హులుగప్ప కత్తిమనెకు ప్రదానం చేశారు. అనంతరం సవవత్తికి చెందిన రంగా ఆరాధన సాంస్కృతిక సంస్థ ప్రదర్శించిన, నేల ముగిలు కన్నడ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు హెచ్.విష్ణువర్ధన్ రెడ్డి, కోశాధికారి పి.ధనంజయ, సంయుక్త కార్యదర్శి పీఎం.నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.


