సాక్షి బళ్లారి: వైట్‌బోర్టు నంబర్ ప్లేట్ కలిగిన ద్విచక్ర వాహనాల ద్వారా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ బైక్ ట్యాక్సీ సేవలను వెంటనే నిషేధించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. సోమవారం బళ్లారి జిల్లా ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు హుండేకర్ రాజేష్ ఆధ్వర్యంలో 200కు పైగా ఆటోలతో తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారుల గుండా జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా హుండేకర్ రాజేష్ మాట్లాడుతూ.. బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాల ద్వారా ఆన్‌లైన్ రైడ్ సేవలు కొనసాగిస్తుండటంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ర్యాపిడోతో పాటు ఇతర ఆన్‌లైన్ రైడ్ బుక్కింగ్ సేవలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


