మురుగులో అహరహం ..
సాక్షి,బళ్లారి: నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ రోజురోజుకు అస్తవ్యస్తంగా మారుతోంది. నగరంలో ఏదో ఒక వీధిలో ప్రతి రోజు డ్రైనేజీ లీకేజీ కావడం సర్వసాధారణంగా మారిపోయింది. రోడ్లలో దుర్వాసన వెదజల్లే మల, మూత్రాల విసర్జన చేసిన మురుగునీరు రోడ్లలో పారుతున్న దృశ్యాలు నగర ప్రజలకు కంటికి నిత్యం కనిపిస్తున్నాయి. పేరుగొప్ప,, ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. దుర్వాసన వెదజల్లే వీధులు కోకొల్లలు. పేరుకే స్టీల్ సిటీగా చెప్పుకునే నగరం చెత్తతో పాటు ప్రస్తుతం దుర్వాసనకు నిలయంగా మారింది. నగరంలో ఏటేటా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనం సాగించే వారి జనాభా కూడా పెరిగిపోతోంది. మురికివాడల కాలనీలతో పాటు ప్రధాన రహదారులు, ఇళ్ల డ్రైనేజీలు బ్లాక్ కావడం, అవి లీకేజీ కావడం నిత్యకృత్యమైంది.
ఐదు నెలలుగా అందని వేతనాలు
ఎక్కడ, ఏ రోడ్డులో డ్రైనేజీ లీకేజీ అయినా ఇళ్ల డ్రైనేజీలు బ్లాక్ అయి రోడ్లలో మురుగునీరు ప్రవహించినా టక్కున గుర్తుకు వచ్చేది డ్రైనేజీలను శుభ్రం చేసే పౌరకార్మికులు. ఈ సమస్యను ప్రతి రోజు డ్రైనేజీ మురికి నీటిని అష్టకష్టాలతో శుభ్రం చేస్తూ, నగర ప్రజల ఆరోగ్యాలను కాపాడే చేతులకు పనికి తగ్గ వేతనం పక్కన బెడితే కనీస వేతనాలు కూడా నెలనెలా అందక ఆయా కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యాలను, చివరకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డ్రైనేజీలు శుభ్రం చేసే కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసే పౌరకార్మికుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. వర్షం వచ్చినా. ఎండ మండినా, చివరకు పండుగ రోజైనా, అర్ధరాత్రయినా డ్రైనేజీ లీకేజీ సమాచారం అందిస్తే వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకుని మురుగునీరు రోడ్లలో, ఇళ్ల ముందు నిల్వ ఉండకుండా ఖాళీ చేస్తారు.
భద్రతా పరికరాలు లేకుండానే..
చేతికి కనీసం గ్లౌజులు కూడా వేసుకోకుండా మల, మూత్రాదులను తొలగించి రోడ్లలో ప్రవహిస్తున్న మురుగునీటిని రాకుండా అడ్డుకట్ట వేస్తారు. డ్రైనేజీల్లో విషవాయువులు, దోమలు, బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయని తెలిసినా, సరైన పరికరాలు కూడా లేకుండా చేతులతో శుభ్రం చేస్తున్నామని, అయినా తమకు నెలనెలా జీతాలు అందడం లేదని పౌరకార్మికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఇంట్లో పస్తులు కూడా ఉంటున్నామన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు తమవి అని కన్నీరు పెడుతున్నారు. నెలంతా కాయకష్టం చేసి, దుర్వాసన వెదజల్లే మురుగునీటి మధ్యనే పని చేస్తున్నప్పటికీ, నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేలు మాత్రమే జీతాలు ఇస్తున్నారని, ఆ జీతాలు కూడా నెలనెలా సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికుడు వండ్రప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని పౌరకార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
లీకైన డ్రైనేజీని శుభ్రం చేస్తున్న పౌరకార్మికుడు
నిత్యం మలమూత్రాదుల్లో శ్రమ
పౌర కార్మికుల స్థితి దైన్యం
లీకేజీతో వీధుల్లో దుర్వాసన


