జనస్నేహిగా రవాణా శాఖ సేవలు | - | Sakshi
Sakshi News home page

జనస్నేహిగా రవాణా శాఖ సేవలు

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

హుబ్లీ: ప్రయాణికులకు సమర్థంగా రవాణా సదుపాయం కల్పించే దిశలో అవసరమైన అన్ని కనీస సౌకర్యాలతో వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ జనస్నేహిగా కృషి సేవలందిస్తోందని సంస్థ డివిజనల్‌ కంట్రోలర్‌ హెచ్‌ రామన్నగౌడర్‌ తెలిపారు. హుబ్లీ రూరల్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఈ ఎం.శివకుమార్‌ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆధునిక బస్టాండ్లు, బస్సు డిపోలు, పాలనా కార్యాలయాలు తదితర కట్టడాల నిర్మాణం, నిర్వహణలో నిర్మాణ శాఖ పాత్ర ప్రముఖమైందన్నారు. శివకుమార్‌ సంస్థలో 31 ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా సేవలందించారన్నారు. ఆయన వృత్తిపరత్వం, సేవా నిబద్ధత జూనియర్‌ ఉద్యోగులకు ప్రేరణ ఇచ్చిందన్నారు. హుబ్లీ ధార్వాడ నగర రవాణా డీసీ ఇనాయత్‌ భగవాన్‌, నాలుగు సబ్‌ డివిజన్ల అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు శివకుమార్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. అధికారులు దీపక్‌ జాధవ్‌, శివారెడ్డి, రాజేంద్ర, గురుప్రసాద్‌, నజీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

8న ఉద్యోగ మేళా

హుబ్లీ: ఐబీఎంఆర్‌ గ్రూప్‌ సంస్థ ఆధ్వర్యంలో అక్షయ కాలనీలోని కళాశాలలో ఈ నెల 8న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రగతి– 2026 ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ సీఈఓ విజ్ఞేష్‌ సక్రి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మేళాను జిల్లాధికారి స్నేహల్‌ ప్రారంభిస్తారు. ఐటీఐ అధికారి రవీంద్ర జాబేరి, సంస్థ చైర్మన్‌ వినయ్‌ చంద్ర, ట్రస్టీ సుమా మేళాలో పాల్గొంటారన్నారు. డిజిటల్‌ ఎకానమి మిషన్‌, క్లిక్‌ నౌకరీ.కాం, గ్రొమిట్‌ గ్లోబల్‌ ఐ వర్క్‌ సంస్థల సహకారంతో మేళాను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 150 కంపెనీలు, 6,000 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. 12 వేల మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. సుమారు 2,000 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. నమోదు పూర్తిగా ఉచితమని, పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా అభ్యర్థులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో ఈనెల 5న ఉచిత ఆన్‌లైన్‌ వర్క్‌ షాప్‌ ఏర్పాటు చేశామన్నారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇంజనీరింగ్‌, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు మేళాలో పాల్గొనవచ్చన్నారు. గత ఉద్యోగ మేళాలో గరిష్టంగా రూ.7.5 లక్షల వార్షిక వేతనం, సగటున రూ.4 లక్షల వార్షిక వేతనాన్ని అభ్యర్థులు సాధించారని గుర్తు చేశారు. వెంకటేష్‌, విక్రమ్‌, ప్రొఫెసర్‌ అణ్ణప్ప తదితరులు పాల్గొన్నారు.

కాలుష్య కారక పరిశ్రమలు వద్దు

రాయచూరు రూరల్‌: కొప్పళ జిల్లాలో కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు తగదని కొప్పళ జిల్లా బచావో ఆందోళన సమితి, పర్యావరణ హితరక్షణ సమితి అధ్యక్షుడు అగ్ని దివ్యా అన్నారు. ఆదివారం కొప్పళ నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. విష వాయువులను వెదజల్లే పరిశ్రమలను స్థాపించి మానవాళి జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. బల్డోటా, కిర్లోస్కర్‌, కళ్యాణి స్టీల్‌, ముక్కుంది సుమి, ఎక్సో ఇండియా పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితమై మానవాళి ఆయుష్షు క్షీణిస్తుందన్నారు. అలాంటి వినాశకర పరిశ్రమల స్థాపనకు ససేమిరా అంగీకరించరాదని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

కృష్ణమ్మ పరవళ్లు

రాయచూరు రూరల్‌: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి నుంచి కృష్ణా నదికి 1.30 లక్షల క్యూసెక్కులు నారాయణపూర్‌ డ్యాంకు వదిలారు. ఆదివారం నారాయణపూర్‌ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. యాదగిరి జిల్లా సంగమ, రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా హువిన హెడగి వద్ద వంతెనపై గుండా నీరు పారుతున్నాయి. రాయచూరు, కలబుర్గి, విజయపుర జిల్లాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా నదీ తీరంలో దేవసూగూరు, దొంగ రాంపూర్‌, ఆత్కూర్‌, బూడిదపాడు, నారదగడ్డల వద్ద ప్రజల రక్షణకు చర్యలు చేపట్టాలని జిల్లాధికారిణి పూవిత సూచించారు. విజయపుర, యాదగిరి, రాయచూరు జిల్లాల యంత్రాంగం అన్ని రకాలుగా వరద నివారణ చర్యలు చేపట్టారు.

కస్టడీలో వ్యక్తి మృతి..

ఇద్దరు పోలీసులపై కేసు

హొసపేటె: హగరిబొమ్మనహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి మృతికి సంబంధించి హెడ్‌ కానిస్టేబుల్‌తో సహా ఇద్దరు పోలీసులపై కేసు నమోదైంది. హగరిబొమ్మనహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి కస్టడీ మృతిపై కేసు నమోదైంది. మృతుడు ఖలీల్‌ భార్య శహనాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హగరిబొమ్మనహళ్లి పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాఘవేంద్ర ఇటగిని ఏ1గా, పోలీస్‌ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ను ఏ2గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. న్యాయమూర్తి సమక్షంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్పీ జాహ్నవి ఉదయం నుంచి పోలీస్‌ స్టేషన్‌లోనే మకాం వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement