హొసపేటె: విజయనగర జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల దాడి కారణంగా ఖలీల్(38) అనే వ్యక్తి కస్టడీలో మరణించాడని మృతుడి కుటుంబం ఆరోపించింది. హరపనహళ్లి తాలూకాలోని నందీపురకు చెందిన యువతితో ఖలీల్‌కు వివాహమైంది. భార్యతో గొడవ పడటంతో ఆమె పోలీసు సహాయవాణి 112కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె భర్తను స్టేషన్‌కు విచారణ కోసం తీసుకు వస్తుండగా అతనికి ఫిట్స్ వచ్చి మరణించాడని పోలీసులు తెలిపారు. హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ ఎస్పీ జాహ్నవి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. నిర్మాణ కార్మికుడి మృతితో పోలీస్ స్టేషన్ ముందు ప్రజలు గుమిగూడారు. ముందు జాగ్రత్తగా పోలీసు స్టేషన్ వద్ద అదనపు సిబ్బందిని మోహరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తాలూకా ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే కే.నేమిరాజ్ నాయక్ హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఎస్పీ జాహ్నవి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం మృతికి కారణమైన వివరాలు బయటపడతాయని ఎస్పీ జాహ్నవి తెలిపారు.
కస్టడీలో నిందితుడు మృతి
కుటుంబ సభ్యుల ఆరోపణ


