హొసపేటె: తల్లీ బిడ్డల ఆరోగ్యానికి తల్లి పాలు చాలా ముఖ్యం. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి, మెదడు అభివృద్ధికి తల్లి పాలు అవసరమని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ టీ.లింగరాజు తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. తల్లి పాలలో ఉండే ప్రొటీన్ బిడ్డ తెలివి తేటలను పెంచడమే కాకుండా భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారిస్తుందన్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా తల్లీ, బిడ్డల మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుందన్నారు. క్రమం తప్పకుండా తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లిని రొమ్ము క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడుతుందని ఆయన అన్నారు. సుస్థిరమైన జీవితానికి బలమైన పునాది వేయడానికి, సమర్థవంతమైన తల్లి పాలు పట్టే పద్ధతులను బలోపేతం చేద్దామని జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య అన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లి పాల వారోత్సవంలో భాగంగా వివిధ ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. ప్రసవం తర్వాత వెంటనే తల్లి రొమ్ము నుంచి వచ్చే మొదటి పసుపు పాలు బిడ్డకు సంజీవినిగా పని చేస్తాయన్నారు. ఇది పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుందని ఆయన అన్నారు. పుట్టిన ఒక గంటలోపు తల్లి పాలు పట్టడం తప్పనిసరి అన్నారు. మొదటి ఆరు నెలల వరకు బిడ్డకు నీరు గానీ ఇతర ఆహారం గానీ ఇవ్వకూడదు. ఆరు నెలల తర్వాత, రెండేళ్ల వరకు తగిన అనుబంధ ఆహారాలతో పాటు తల్లి పాలు పట్టడం కొనసాగించాలన్నారు. జిల్లా క్షయవ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా కుష్ఠువ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ రాధిక, జిల్లా వాహక వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ సతీష్ చంద్ర, జిల్లా ఆరోగ్య విద్యా అధికారి ఎంపీ దొడ్డమని, ఆరోగ్య ఇన్‌స్పెక్టర్ ధర్మనగౌడ, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ వినోద్, బాలింతలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
డీహెచ్‌ఓ డాక్టర్ టీ.లింగరాజు


