హుబ్లీ: డ్రైవర్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడిన ఘటన ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా కుబిహాళ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. హుబ్లీ నుంచి కారడిగి గ్రామానికి వెళుతున్న సదరు బస్సు కుబిహాళ దగ్గర డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గోతిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఆందోళన చెందారు. పలువురు మహిళలకు చిన్నచితకా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చి గాయపడిన వారిని రక్షించి తక్షణమే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
యువత దురలవాట్లకు బానిస కావద్దు
రాయచూరు రూరల్ : నేటి ఆధునిక యుగంలో యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాధికారి కార్యాలయంలో జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో మహంత స్వామి జయంతి సందర్భంగా ఇలకల్ మహంత శివయోగి మద్యపాన వ్యసనం నుంచి విముక్తి కోసం చేపట్టిన పోరాటం గురించి మాట్లాడారు. యువత సన్మార్గం వైపు నడవాలన్నారు. భారతీయ సంస్కృతి, ఆచార, విచారాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. సమావేశంలో వార్త శాఖాధికారి సురేష్, డాక్టర్ మనోహర్ పత్తార్‌లున్నారు.
కనీస వేతనం అందించరూ
రాయచూరు రూరల్: విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అందించాలని విద్యుత్ కార్మికుల సంఘం సంచాలకుడు శరణ బసవ డిమాండ్ చేశారు. శనివారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. గత 10–15 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనం కల్పించాలని కోరుతూ జెస్కాం ఇంజనీర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
మేకల దొంగల అరెస్టు
క్రిష్ణగిరి: కందికుప్పం సమీపంలోని అంజూర్ గ్రామంలో ఇటీవల 3 మేకలను ఎవరో ఎత్తుకెళ్లారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ఆటోలో మేకలను ఎత్తుకెళ్తున్నట్లు తేలింది. వారిని పట్టుకుని విచారించగా బత్తలపల్లికి చెందిన యారబ్ (21), క్రిష్ణగిరి శాంతినగర్‌కు చెందిన సేటు (21) అని తెలిసింది. వారిని అరెస్ట్ చేసి ఆటోను స్వాధీనపరుచుకొన్నారు.


