గుండెపోటుతో మాజీ మంత్రి వెంకటరమణప్ప మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో మాజీ మంత్రి వెంకటరమణప్ప మృతి

May 30 2026 2:56 AM | Updated on May 30 2026 2:56 AM

తుమకూరు: తుమకూరు జిల్లా పావగడ తాలూకాకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి వెంకటరమణప్ప(80) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం బెంగళూరులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. మాజీ మంత్రి వెంకటరమణప్ప భార్య శారదమ్మ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు ఎమ్మెల్యే హెచ్‌.వీ. వెంకటేష్‌, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకటరమణప్ప క్రమంగా మంత్రిగా ఎదిగి పావగడ తాలూకా రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. వెంకటరమణప్ప పొన్నసముద్ర గ్రామం నుంచి తొలిసారిగా మండల పంచాయతీ సభ్యుడిగా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించి, 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా సేవ చేశారు. వీరేంద్ర పాటిల్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1989లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాష్ట్రంలో ఎస్‌.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో వెంకటరమణప్ప మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సాధించారు.

యడియూరప్ప, కుమారస్వామి కేబినెట్లలో చోటు

ఆ ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఎస్‌.యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇచ్చి తొలిసారిగా కేబినెట్‌ మంత్రి అయి చిన్న తరహా, పట్టు పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 2018లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత, హెచ్‌.డీ.కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ప్రభుత్వంలో 14 నెలల పాటు కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌, మాజీ మంత్రులు డాక్టర్‌ జీ.పరమేశ్వర్‌, కే.ఎన్‌.రాజణ్ణ, ఎమ్మెల్యేలు టీ.బీ. జయచంద్ర, కె.షడక్షరి, ఎస్‌.ఆర్‌.శ్రీనివాస్‌, డాక్టర్‌ రంగనాథ్‌, సురేష్‌ గౌడ, జ్యోతిగణేష్‌, సురేష్‌ బాబు, ఎం.టీ.కృష్ణప్పలతో సహా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, నాయకులు, కార్యకర్తలు వెంకటరమణప్ప మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పావగడ తాలూకాలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి, ఆ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన ఒక నిరాడంబర పెద్దమనిషిని జిల్లా కోల్పోయిందని అన్నారు.

అంతిమ దర్శనానికి ఏర్పాట్లు

పావగడ పట్టణంలోని గురు భవన్‌ మైదానంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు పార్థివదేహం అంతిమ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆయన స్వగ్రామం హనుమంతనహళ్లిలోని ఆయన నివాసంలో సాయంత్రం 4 గంటలకు ప్రజలకు తుది నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి వెంకటరమణప్ప అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ఆయన తోటలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని కుటుంబ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement