బనశంకరి: కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల పరీక్షల స్కాంలో ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. నగరంలో జయమహల్ వద్ద గల నివాసంలో సోదాలు చేశారు. 25 ఉదయం 11 గంటలకు అవసరమైన ఆధారాలతో శాంతినగరలోని ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని తలుపులకు నోటీసు అంటించారు. ఈడీ దాడులు మొదలు కాగానే గత 5 రోజుల నుంచి ఆయన జాడ లేరు. ఒక్కో ఉద్యోగానికి రూ.40 లక్షల నుంచి 70 లక్షల వరకూ వసూళ్లు చేశారని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపించడం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లక్నోలోని జ్ఞానేంద్రకుమార్ నివాసంలో ఈడీ దాడి చేయగా, జ్ఞానేంద్రకుమార్ పరారైనట్లు తెలిసింది. తండ్రి సహాయకులు తప్ప కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేరు.
పార్కుల స్థల సేకరణ బిల్లుకు ఆమోదం
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవనం స్థలాల్లో 5 శాతం విక్రయం, కాంట్రాక్టు, కుదువ పెట్టడానికి అనుమతి, సహా 8 బిల్లులను విధానసభలో ఆమోదించారు. ప్రతిపక్షాల గొడవల మధ్య స్పీకర్ జీఎస్ పాటిల్... కర్ణాటక సరుకు సేవలు బిల్లు, రిజిస్ట్రేషన్, కర్ణాటక దుకాణాలు, వాణిజ్య కార్యసంస్థలు, గ్రామస్వరాజ్, పంచాయతీరాజ్, రెవెన్యూ బిల్లు, పారిశ్రామిక సౌలభ్య సవరణ, బెంగళూరు మహానగర భూసారిగె ప్రాధికార బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు.
అగ్నివీర్ దుర్మరణం
మైసూరు: బైక్‌లో వెళ్తూ కిందపడి అగ్నివీర్ జవాన్ మరణించాడు. ఈ ఘటన మైసూరు చాముండిబెట్ట రోడ్డులో జరిగింది. జిల్లాలోని హుణసూరు తాలూకా హిరిక్యాతనహళ్లి నివాసి నంజేగౌడ, దివంగత రూపా దంపతుల కుమారుడు నందన్ (24). అతడు ఆర్మీలో అగ్నివీర్ సిపాయిగా మూడేళ్ల నుంచి జమ్మూ కశ్మీర్‌లో పని చేస్తున్నాడు. 14 రోజుల క్రితం సెలవు మీద ఊరికి వచ్చిన నందన్ చాముండి కొండపై దర్శనానికి బైక్‌లో వెళుతుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. కొందరు అతన్ని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స ఫలించక మరణించాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలను పూర్తిచేశారు.
ప్రేమపెళ్లి.. బలవన్మరణం
మైసూరు: మూడేళ్లుగా ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాళ తాలూకా ముడిగుండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఐశ్వర్య (25), పెట్రోల్ బంక్‌లో పనిచేసే పునీత్ అనే వ్యక్తి ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్య తల్లిదండ్రులు ఈ వివాహానికి అడ్డు చెప్పినప్పటికీ వినలేదు. దాంతో మూడేళ్లుగా తల్లిదండ్రులు ఐశ్వర్యతో మాట్లాడడం లేదు. పైగా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. జీవితంపై విరక్తి చెందిన ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. ఇరుగుపొరుగు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, తహశీల్దార్ పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆమె అంత్యక్రియలకు కూడా కుటుంబీకులు రాలేదు.
కావేరిపై సుప్రీంలో వాదనలు
బనశంకరి: కావేరి నదీ జలాల పంపకంపై తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. జడ్జిలు జస్టిస్ విక్రమ్‌నాథ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో రావాలని ఉభయ రాష్ట్రాలకు ఆదేశించి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కర్ణాటకలో కావేరి జలాశయాల్లో 78 టీఎంసీల నీరుందని తమిళనాడు న్యాయవాది వాదించారు. ఇవ్వవలసినంత నీరు రావడం లేదని తెలిపారు. కావేరి కమిటీ ఆదేశాల మేరకు నీరు అందించినట్లుగా ఉందని జడ్జి పేర్కొన్నారు. ఇప్పటికే తమిళనాడుకు నీరు విడుదల చేస్తున్నట్లు కర్ణాటక వకీలు తెలిపారు.
చెత్త ఊడుస్తూ.. లగ్జరీ కారు
యశవంతపుర: ఓ పౌర కార్మికుడు ఖరీదైన ఫార్చూనర్ కారులో వెళ్లి చెత్తను ఊడ్చి, మళ్లీ అదే కారులో ఇంటికి వెళ్తారు. ఇది నిజమే. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళలో కార్మికుడు సేనప్ప ఫార్చూనర్‌లోనే డ్యూటీకి వెళ్తారు. కారును ఆఫీసు పక్కన నిలిపి, చీపురు పట్టుకుని రంగంలోకి దిగుతారు. అతని లగ్జరీ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. సేనప్ప 3వ తరగతి వరకు మాత్రమే చదివారు. 1996లో రోజుకు రూ.50 కూలీతో ఉద్యోగం చేరి పర్మినెంట్ అయ్యాడు. రూ.40 వేల జీతం వస్తుంది. ఒకప్పుడు తండ్రి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేని దశ నుంచి లక్షాధికారిగా మారాడు. 2005లో బంట్వాళ ఎస్‌ఐ బెళ్లియప్ప ఉపదేశంతో సేనప్పలో మార్పు వచ్చింది. తాగుడు మానేసి సంపాదనపై దృష్టిపెట్టాడు. ఇంటి వద్ద ఆవులు పెంచి పాలు అమ్ముతున్నాడు.


