రాయచూరు రూరల్: రైతు సంక్షేమమే సర్కార్ ప్రధాన లక్ష్యమని పేర్కొంటున్న ఈ ప్రభుత్వంలో ఓ వైపు రైతులకు సకాలంలో ఎరువులు, పురుగుల మందులు లభించక తల్లడిల్లుతున్నారు. మరో వైపు అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా బస్తాలను కలబుర్గిలో స్వాధీనం చేసుకున్న ఘటన వెలుగు చూసింది. కలబుర్గిలోని కపనూర్ దాల్ మిల్లులో అనుమతి లేకుండా నిల్వ చేసిన 1,250 ఎరువుల బస్తాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బాలరాజ్, కవిత, జహంగీర్ దాడి జరిపి స్వాధీనపరుచుకున్నారు. సబర్బన్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
బళ్లారి అర్బన్: క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని నగర మేయర్ పీ.గాదెప్ప యాదవ్ తెలిపారు. నగరంలోని జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అండర్–16 హాకీ టోర్నీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 12 జట్లు పాల్గొని తమ సత్తాను చాటాయి. టోర్నమెంట్‌లో భాగంగా తొలి హాకీ మ్యాచ్‌లో బళ్లారి జట్టు 5 గోల్స్ తేడాతో గదగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. అలాగే మిగతా జట్లు కూడా పోటాపోటీగా తమ ప్రతిభను కనబరిచాయి. బళ్లారి హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు సైయ్యద్ సైఫుల్లా, కార్యదర్శి కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నూర్ అహమ్మద్, కోశాధికారి ఎంవై.శ్రీధర్‌బాబు, సభ్యులు శివానంద, భరత్‌కుమార్, రవికుమార్, షేక్షావలీ, రంగస్వామి, కార్తీక్, రాజు, మహబూబ్ బాషా, షాషావలి, మహేష్ పాల్గొన్నారు.
పంపుసెట్ పరికరాల పంపిణీ
రాయచూరు రూరల్: రైతుల సంక్షేమమే సర్కార్ ప్రధాన లక్ష్యమని విధాన పరిషత్ సభ్యుడు బోసురాజు, శాసన సభ్యుడు హంపయ్య నాయక్ అభిప్రాయ పడ్డారు. ఆదివారం సాయంత్రం మాన్వి నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాల రైతులకు పంప్‌సెట్ల పరికరాలను పంపిణీ చేసి వారు మాట్లాడారు. గంగా కళ్యాణ పథకం ద్వారా రైతులు లబ్ధి పొంది ఆర్థికంగా రైతులు స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. బోరుబావుల ద్వారా పంటలు పండించే రైతులు భూగర్భ జలాల వృద్ధికి సహకరించాలన్నారు. ఆంజనేయ, జయణ్ణ, తిమ్మప్ప, నరసింహులు, శివమూర్తి, అమరేగౌడ, తాయన్న, రమేష్, హన్మంతు, మహదేవ్, గోవిందప్పలున్నారు.
పంట నష్టపరిహారం చెల్లించండి
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్‌లో ముందుగా కురిసిన వానలకు రైతులు విత్తిన పంటలకు పంట నష్ట పరిహారం అందించాలని బీదర్ దక్షిణ శాసన సభ్యుడు శైలేంద్ర బేల్దాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీదర్ జిల్లాలో అష్టూర్, సుల్తాన్‌పుర, మల్కాపూర్ ప్రాంతాల్లో రైతుల పంట పొలాలను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరువు పీడిత ప్రాంతాలను గుర్తించడంలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతాల్లోని రైతుల భూముల్లో వేసుకున్న పంటలు వానలు కురువక వాడుముఖం పట్టాయని రూ.50 వేలు పంటనష్ట పరిహారం అందించాలన్నారు. శనగ, పెసర, జొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, కంది వంటిి పంటలు ఎండిపోతున్న విషయంపై సర్కార్‌కు వివరిస్తామన్నారు. సంగమేష్, బాబూరావ్, ఆరతి పాటిల్, లక్ష్మి, గాయత్రి, శివకుమార్, ధన్‌రాజ్, నాగేష్‌లున్నారు.


