
ప్రతిభా వికాసానికి వేదిక అవసరం
హుబ్లీ: చిన్నారుల్లో ప్రతిభ వికాసానికి వేదిక అవసరం అని గౌతమబుద్ధ ఫౌండేషన్ కోశాధికారి లక్ష్మణ నాగరాళ అన్నారు. ఆయన గురువారం హక్కిహోండా ప్రభుత్వ ఆదర్శ కన్నడ బాలికల పాఠశాలలో క్విజ్, చిత్రలేఖన పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు మహంతేష్ దొడ్డమనె మాట్లాడుతూ పిల్లల్లోని ప్రతిభ వికాసానికి తగిన వేదిక కల్పించాలన్నారు. దీనివల్ల పిల్లల్లో జ్ఞానాభివృద్ధి వికసిస్తుందన్నారు. పాఠాలతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. పిల్లలను పోటీ ప్రపంచానికి సిద్ధం చేయాలని సూచించారు. ఎటువంటి పరీక్షలైనా సులభంగా రాసి నెగ్గుకురావడానికి వీలవుతుందన్నారు. ఫౌండేషన్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ఆనంద్ పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
హుబ్లీ: ప్రమాదాలు, తీవ్రమైన రోగాల బారిన పడిన వ్యక్తికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి కృషి చేయాలని శిగ్గాంవి తాలూకా కాంగ్రెస్ నేత ఎం.ఎం.యాసిర్ అహమ్మద్‌ఖాన్ పటాన్ తెలిపారు. గురువారం ఆయన పట్టణంలోని ఓ సభామందిరంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. యాసిర్ అహమ్మద్‌ఖాన్ పటాన్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని పండ్లు, ఫలహారాలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో మంచి స్పందన లభించింది. అధికారం, అంతస్తులు, సంపద ఎప్పటికీ శాశ్వతం కాదని, దొరికిన అధికార అవధిలో మంచి పనులు చేస్తే ఆ పరోపకారం పదికాలాల పాటు నిలుస్తుందన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందన్నారు. చిన్న చిన్న పనులకు కష్టపడి పొట్ట నింపుకునే పేదలకు సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీటి పథకాల పనులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
నేటి నుంచి మైసూరు శాండిల్ సోప్‌ల ప్రదర్శన
రాయచూరు రూరల్: నగరంలో శుక్రవారం నుంచి మైసూరు శాండిల్ సోప్‌ల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కర్ణాటక సోప్స్ డెవలప్‌మెంట్ బోర్డు జనరల్ మేనేజర్ రంగప్ప పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రారష్ట్‌ర ప్రభుత్వ ఆధీనంలోని మైసూరు సోప్స్ గ్రూ్‌ప్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరు వరకు నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. వంద ఏళ్ల చరిత్ర గల మైసూరు శాండిల్ సోప్‌లకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉందన్నారు. 2023–24లో రూ.1571 కోట్ల లావాదేవీలు జరిపి రూ.362 కోట్ల లాభాలు గడించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మైసూరు సబ్బుల మాదిరిగా నకిలీ ఉత్పత్తులు తయారు చేసిన కంపెనీపై ఫిర్యాదు చేశామని, కోర్టులో కేసు విచారణ సాగుతోందన్నారు. కేరళ నుంచి కూడా ఇలాంటి కేసు రావడంతో దానిపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ కర్ణాటక భాగంలో శ్రీగంధం చెట్లు పెంచుతున్న రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు.