
మహోగ్ర కృష్ణా.. ప్రశాంత తుంగా
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, నదీ పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదితో పాటు ఉత్తర కర్ణాటకలోని దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిలో ఉరకలెత్తుతున్నాయి. దీంతో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్‌కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, రాయచూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర కర్ణాటకలోని నిప్పాణి తాలూకాలో బోజ–కున్నూర వద్ద వేదగంగా నదిపై నిర్మించిన కడకోళ వంతెన వరద నీట మునిగింది. ఆల్మట్టి డ్యాం గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు కాగా ప్రస్తుతం 518.30 మీటర్ల మేర నీరు నిల్వ చేరాయి. ఎగువ నుంచి 2.96 లక్షల క్యూసెక్కుల నీరు వరద రూపంలో వస్తుండగా డ్యాం నుంచి 1.96 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఈనేపథ్యంలో నదీ తీర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లింగసూగూరు తాలూకా శీలహళ్లి వంతెనను తాకుతూ వరద నీరు పారుతున్నాయి. రాయచూరు తాలూకాలోని నదీ తీర ప్రాంతంలో రైతులు అమర్చిన పంప్‌సెట్లను తొలగించుకుంటు న్నారు. రాయచూరు, యాదగిరి జిల్లాల్లో 140 గ్రామాలకు వరద పోటు తాకింది. మణ్ణూరులో యల్లమ్మ దేవాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
కంప్లి వంతెనపై రాకపోకలు ప్రారంభం
హొసపేటె: గత నాలుగు రోజుల నుంచి తుంగభద్రా జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీరు నదికి విడుదల చేయడంతో కంప్లి వంతెన జలావృతమైన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం నుంచి తుంగభద్రమ్మ శాంతించడంతో రోడ్డు వంతెన మీద వాహనాల రాకపోకలు యథావిధంగా ప్రారంభం అయ్యాయి. తుంగభద్ర నదిపై కంప్లి వద్ద నిర్మించిన ఈ వంతెన ప్రధానంగా బళ్లారి– గంగావతి పట్టణాలను అనుసంధానిస్తుంది. మలెనాడు ప్రాంతంలో నిరంతర వర్షపాతం కారణంగా జలాశయానికి 1.30 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. నాలుగు రోజుల పాటు కంప్లి వంతెన జలదిగ్బంధంలో ఉండి పోయింది. చివరికి నదిలో నీటి పరిమాణం క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో వంతెన మీద వాహనాల రాకపోకలను అనుమతించారు.
కుంభవృష్టితో కృష్ణవేణికి
పోటెత్తిన వరద
కళ్యాణ కర్ణాటకలో 140 గ్రామాలకు దెబ్బ

మహోగ్ర కృష్ణా.. ప్రశాంత తుంగా

మహోగ్ర కృష్ణా.. ప్రశాంత తుంగా

మహోగ్ర కృష్ణా.. ప్రశాంత తుంగా

మహోగ్ర కృష్ణా.. ప్రశాంత తుంగా