రాయచూరురూరల్: గ్రామాల్లో సర్కార్ అమలు చేసిన పంచ గ్యారెంటీలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని రాయచూరు వాల్మీకి మహర్షి విశ్వ విద్యాలయం సేనేట్ సభ్యుడు చెన్న బసవ తెలిపారు. శుక్రవారం తాలుకాలోని మన్సలాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీల ద్వారా మహిళలు, విద్యార్థులు, యువకులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచ గ్యారెంటీల అధ్యక్షుడు పవన్ పాటిల్, మౌనేస్ నాయక్, వెంకటేష్ నాయక్, మంజునాథ్, ఈరమ్మ, దేవమ్మ, చెన్నమ్మ, శారద, మహేష్ గౌడ, లక్ష్మి, శరణే గౌడ తదితరులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న
మొబైల్ ఫోన్లు అందజేత
హొసపేటె: సీఐఈఆర్ పొన్సల్ ద్వారా విజయనగర జిల్లా కొట్టూరు పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనుక్కునేందుకు ఆపరేషన్ చేపట్టారు. కొట్టూరు పోలీస్ స్టేషన్‌లో సీఐఈఆర్ పొన్సల్ ద్వారా నమోదైన కేసుల్లో దాదాపు రూ.4,25,000 విలువైన మొత్తం 25 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కూడ్లిగి డీవైఎస్పీ మల్లేష్, దొడ్డమణి సీఐ దురుగప్ప ఆధ్వర్యంలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను ఫిర్యాదుదారులకు అందజేశారు. మొబైల్స్ కనుక్కునేందకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ను విజయనగరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరుణంగ్లుగిరి ప్రశంసించారు.
ఖాస్ బావిలో శుభ్రత పనులు
రాయచూరు రూరల్: నగరంలో పవిత్ర క్షేత్రమైన ఖాస్ బావి శుభ్రతకు అధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సాయంత్రం నగర సభ కమిషనర్ జుబీన్ మోహ పాత్రో ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాల నిమజ్జనం, భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఖాస్ బావి వద్ద పరిశుభ్రత పనులు చేయించారు. జేసీబీతో బావిలో పూడిక తీయించారు. అలాగే రహదారిపై పడిన గుంతల్లో మట్టి వేయించి చదును చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
అప్పు చెల్లించనందుకు ఉపాధ్యాయుడిపై దాడి
రాయచూరురూరల్: తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించక పోవడంతో ఓ ఉపాధ్యాయుడిపై గ్రామ పంచాయతీ సభ్యుడు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. లింగసూగురు తాలుకా ముదుగల్‌లో ప్రభుత్వ పాఠశాలలో హనుమంతు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అవసరం కోసం గ్రామ పంచాయతీ సభ్యుడు వీరణ్ణ వద్ద బంగారు అభరణాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పు చెల్లించాలని వీరణ్ణ పలుమార్లు ఉపాధ్యాయుడు హనుమంతును కోరారు. అయినా అప్పు చెల్లించకపోవడంతో దాడి చేశాడు. గాయపడిన ఉపాధ్యాయుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ రోటవేటర్‌కు చిక్కి
కొండచిలువ మృతి
కోలారు: ట్రాక్టర్‌తో దున్నుతుండగా రోటవేటర్‌కు చిక్కి కొండచిలువ మరణించిన ఘటన తాలూకాలోని హెచ్.మల్లండహళ్లిలో జరిగింది. దేవరాజ్ అనే రైతు పొలంలో కొత్తిమీర సాగుకు రోటవేటర్‌తో భూమిని దున్నుతుండగా దానికి చిక్కి కొండచిలువ తీవ్రంగా గాయపడింది. వెంటనే గ్రామస్తులు స్నేక్ ఆనంద్‌కు సమాచారం ఇచ్చారు. అయితే తీవ్రంగా గాయపడిన కొండ చిలువ అంతలోనే మరణించింది. విషయం తెలిసి అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 4 ఏళ్ల వయస్సు, 10 అడుగుల పొడవు కలిగిన కొండచిలువను అటవీ సిబ్బంది, గ్రామస్తులు పూడ్చిపెట్టారు.
కేంద్ర గ్రంథాలయం తనిఖీ
కోలారు: నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లాధికారి డాక్టర్ ఎంఆర్ రవి సందర్శించారు. గ్రంథాలయంలోని రీడింగ్ రూం, పుస్తకాల గదులను పరిశీలించారు. గ్రంథాలయంలో లభిస్తున్న సౌకర్యాల గురించి పాఠకులను ఆరా తీశారు. పోటీ పరీక్షలను రాసే విద్యార్థులు గ్రంథాలయంలో లభించే పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయంలో అంబేడ్కర్ కేంద్రాన్ని ప్రారంభించడానికి స్థలం గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన మరిన్ని పుస్తకాలను తెప్పిస్తామన్నారు. గ్రంథాలయానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ అధికారి ఎన్.గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.
‘పంచ గ్యారెంటీలు’ ప్రచారం చేయాలి
‘పంచ గ్యారెంటీలు’ ప్రచారం చేయాలి