
వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు
హుబ్లీ: జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు గత 24 గంటల్లో జిల్లాలోని వివిధ తాలూకాల్లో 34 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో హుబ్లీ 10, కుందగోల 2, హుబ్లీ నగరం 9, కలగటిగి 7, నవలగుంద తాలూకాలో 6 ఇళ్లు ఉన్నాయి. మానవులు, జంతువులకు ఎటువంటి హాని జరగలేదని సంబంధిత అధికారులు నిర్వహించిన సంయుక్త సర్వే ప్రగతి పథంలో ఉందని జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
గణపతి ఉత్సవాల్లో
డీజేలపై నిషేధం
రాయచూరు రూరల్: గణేశుడి ఉత్సవాల్లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు. 27న వినాయకులను ప్రతిష్టించి, 31న నిమజ్జనం చేయాలని సూచించారు. రాత్రి 10 గంటల తరువాత డీజేలను వినియోగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బైక్ చోదకుడి మృతి
హుబ్లీ: బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో చోదకుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన హుబ్లీ తాలూకా కుసుగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ నివాసి పవన్ ఏనగి (20) మృతుడు. పని ముగించుకుని హుబ్లీ నుంచి కుసుగల్లు గ్రామానికి బైకులో వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో పవన్ ఏనగికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు.
పల్లకీలో ఊరేగిన శ్రీకృష్ణుడు
రాయచూరు రూరల్: నగరంలో శుక్రవారం మహిళా సమాజ్ భక్తులు శ్రీకృష్ణుడికి పల్లకీ సేవ నిర్వహించారు. తొలుత కృష్ణుడి చిత్రపటాన్ని సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చి, పురవీధుల్లో ఊరేగించారు. త్రైత సిద్దాంత భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. హిందూ ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఆదికర్త ఆచార్య ప్రభోదాంనద యోగీశ్వరుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయుర్వేద పతంజలి సంచాలకులు సురేష్ పాల్గొన్నారు.
హంపీ వీధుల్లో
పోలీసుల కవాతు
హొసపేటె: గణేష్, మిలాద్–ఉన్–నబీ పండుగల నేపథ్యంలో శుక్రవారం హంపీ, కమలాపుర్ పోలీసులు గురువారం వీధుల్లో కవాతు నిర్వహించారు. హంపీ, కద్దిరాంపుర, కమలాపురం, హోసమలపన గుడి, గాలేమ్మన గుడితో పాటు తదితర గ్రామాల్లో కవాతు కొనసాగింది. పండుగల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
కన్నడ భాషకు
ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరురూరల్: గడినాడు ప్రాంతాల్లో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ పాదంగళ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో ప్రథమ కన్నడ అంతరాష్ట్రీయ కన్నడ సాహిత్య సమేళనం ప్రారంభించారు. స్వామీజీ మాట్లాడుతూ.. భాషలో నేటికి తెలుగు, మరాఠీ, కన్నడ కలిపి వాఖ్యనించడం, మాట్లడటం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. అన్యభాషలను గౌరవిస్తూ కన్నడకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువకులు కన్నడ భాషను ఇనుమడింప చేసేందుకు చేసిన పోరాటాలను గుర్తించాలన్నారు. 1980లో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు

వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు

వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు