
ఆక్రమిత నగరసభ స్థలం స్వాధీనం
కోలారు: నగరంలోని ఖాద్రిపుర సమీపంలోని 6.1 ఎకరాల నగరసభ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి నగరసభ అధికారులు శుక్రవారం స్థలానికి వెళ్లి ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. నగరసభ స్థలానికి అధికారులు రెండు నెలల క్రితం కంచె వేసి భద్రపరిచారు. అయితే ఈ మధ్య కొంతమంది కోర్టుకు వెళ్లామని ఆ స్థలంలో నామఫలకం వేశారు. నగరసభ అమర్చిన బోర్డును తొలగించి బెంగళూరు కోర్టులో దావా ఉందని తెలిపి మరో నామఫలకాన్ని ఉంచారు. దీనిని కొందరు నగరసభ దృష్టికి తేవడంతో కమిషనర్ నవీన్‌చంద్ర, అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ సిబ్బందితో స్థలానికి వెళ్లారు. ఆక్రమణలను, ఆక్రమణదారులు వేసిన నామఫలకాలను తొలగించారు. ఆ సమయంలో అక్కడికి చేరిన కొంతమంది ఈ స్థలం తమదని గొడవ చేశారు. మొదలు రికార్డులు తీసుకు రమ్మని, తరువాత పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. స్థలం వద్ద ట్రెంచ్ నిర్మించడానికి తెచ్చిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరసభకు చెందిన ఈ స్థలంలో వసతి రహితులకు ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.