
శోకసంద్రమైన రంజోళ గ్రామం
● హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహాలు
దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా సేడం తాలూకా రంజోళ గ్రామం శోకసంద్రలో మునిగిపోయింది. గ్రామానికి ఐదు మంది హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోగా వారి మృతదేహాలు శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాయి. నరసింహ(60), భార్య వెంకటమ్మ(55) వీరి కుమారుడు అనిల్(32), కుమార్తె కవిత(24), మనవడు అప్పు(2)లు హైదరాబాద్‌లోని మియాపూర్‌లో మృతిచెందారు. ఆర్థిక సమస్యలతో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే వారి మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్రంగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మృత దేహాలకు గ్రామస్తులు చందాలు వేసుకుని దహనసంస్కారాలు నిర్వహించారు. పొట్టకూటి కోసం వెళ్లి విగతజీవులుగా వచ్చిన వారిని చూసి మృతుల బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
విచారణ కోసం
ధర్మస్థలకు రాలేను
● పోలీసులకు సమీర్ లేఖ
● మరో కేసు నమోదు
శివాజీనగర: ధర్మస్థల గురించి అపప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ భయాన్ని ఎదుర్కొంటున్న యూట్యూబర్ సమీర్‌కు మంగళూరులో జిల్లా సెషన్స్ న్యాయస్థానం గురువారం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం సమీర్‌కు వ్యతిరేకంగా చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో ఉన్న యూట్యూబర్ ఎండీ.సమీర్ బెళ్తంగడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ రాశాడు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంఽధించి లేఖ రాస్తున్నాను. తాను ధర్మస్థల స్టేషన్‌కు రావటానికి సాధ్యం. అయితే తన స్నేహితుడిపై ప్రాణాంతకమైన దాడి జరిగింది. టార్గెట్ చేసి యూట్యూబర్ స్నేహితుడిపై దాడి చేశారు. తనకు ప్రాణబెదిరింపు ఉంది. ప్రమాదముందని తెలుసుకొని తాను సెషన్ న్యాయస్థానంలో బెయిల్‌కు అప్‌లై చేశానని తెలిపారు. ఒకవేళ తాను ధర్మస్థల పోలీస్ స్టేషన్‌కు వస్తే తనకు భద్రత కల్పించండి. తాను కేసుకు సంబంధించి మీతో వీడియో కాల్ ద్వారా విచారణకు, అన్ని విధాలుగా తనిఖీకి సహకరిస్తాను. తనిఖీకి సహకరించేందుకు చిరునామా, తేదీ, తన భద్రత గురించి తెలియజేస్తే వస్తాను. 15 రోజుల గడువులోగా మీ ముందు హాజరవుతానని, దయచేసి తనకు భద్రత కల్పించాలని లేఖలో తెలియజేశారు.
బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
బొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకా జిగణి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న హారగద్దె వి.ఎస్.ఎస్.ఎన్.బ్యాంకు మేనేజర్ ప్రకాశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన కొన్ని సంవత్సరాలుగా మేనేజర్‌గా పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జిగణి పోలీసులు వెళ్లి పరిశీలించగా ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. కొంతమంది వ్యక్తులు తనను బెదిరించి అక్రమంగా రుణాలు తీసుకున్నారని, తిరిగి చెల్లించాలని కోరితే వేధింపులకు పాల్పడుతున్నారని, గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకాష్ అందులో పేర్కొన్నట్లు ఉందని పోలీసులు తెలిపారు. ఎవరెవరు అక్రమంగా రుణాలు తీసుకున్నారనే పేర్లు కూడా అందులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.

శోకసంద్రమైన రంజోళ గ్రామం