
రోడ్డు మరమ్మతు చేయాలని 25న ధర్నా
కోలారు: జిల్లాలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న కోలారు– శ్రీనివాసపురం రహదారిలో వీరాపుర గేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ తెలిపారు. శుక్రవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రహదారులు అధ్వాన స్థితిలో ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతుండటంతో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయన్నారు. కాంట్రాక్టర్లు రహదారులను నాణ్యత లేకుండా నిర్మిస్తుండటం వల్ల నిర్మించిన కొద్ది రోజులకే అవి గుంతలు పడుతున్నాయన్నారు. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోగా మరెంతో మంది కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నారన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల బాధ్యతారాహిత్యం వల్లే ఇదంతా జరుగుతోందన్నారు. వర్షం వస్తే గుంతల్లో నీరు నిలిచి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. అధికారుల కళ్లు తెరిపించడం కోసం ధర్నా చేస్తున్నామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, రాష్ట్ర సంచాలకుడు బంగవాది నాగరాజు, తేర్నహళ్లి అంజినప్ప పాల్గొన్నారు.