
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
హొసపేటె: గౌరీ గణేష్, మిలాద్–ఉన్–నబీ పండుగలు ఒకే సమయంలో వచ్చాయి. పండుగలను సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ ఎంఎస్ దివాకర్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో గౌరీ, ఈద్ మిలాద్ ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎంఎస్ దివాకర్ మాట్లాడుతూ.. శాంతి, సామరస్యానికి ప్రసిద్ధి చెందిన విజయనగరం జిల్లాకు చెడ్డపేరు తీసుకుని రాకుండా.. అన్ని మతాల ప్రజలు కలిసి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఆస్పత్రులు పాఠశాలలు సహా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని తెలిపారు. సింగిల్ విండో వ్యవస్థ కింద గణేష్ ప్రతిష్టకు అవసరమైన స్థలం, పెండల్, విద్యుత్ కనెక్షన్ కోసం సంబంధిత స్థానిక అధికారుల అనుమతి పొందాలని పేర్కొన్నారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. శాంతిభద్రతల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంజునాథ్, డీవైఎస్పీలు టి.మంజునాథ్, వెంకటప్ప నాయక్, అన్ని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు వివిధ తాలుకాలకు చెందిన గణేష్ ప్రతిష్టాపన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.