
వీడిన విద్యార్థిని హత్య కేసు మిస్టరీ
● ప్రియుడే కాలయముడై హత్య చేసిన వైనం
సాక్షి బళ్లారి: ప్రేమించిన తర్వాత పెళ్లి జరగకపోతే లేదా పెద్దలు ఒప్పకోక పోయినా ప్రేమికులు ఆత్మహత్య చేసుకొన్న ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. అయితే ప్రేమించిన యువతిని ప్రియుడు నమ్మించి మోసం చేసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. చిత్రదుర్గ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వర్షిత(19) అనే యువతిని ప్రేమికుడే విలన్‌గా మారి కిరాతకంగా హత్య చేశాడు. ఈనెల 14న కనిపించకుండా పోయినా వర్షితను ఆమె ప్రియుడు చేతన్ దారుణంగా హత్య చేసినట్లు తేలింది. చిత్రదుర్గ జిల్లా గోసరహళ్లిలో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకున్న చేతన్ అనే యువకుడు పథకం ప్రకారం వర్షితను హత్య చేయాలని నిర్ధారించుకొని సదరు యువతిని పిలుచుకొని కొంత దూరం వచ్చిన సీసీటీవీ పుటేజ్‌లు లభ్యమయ్యాయి. వర్షితతో కలిసి వచ్చి ఎవరూ లేని ప్రదేశంలో కొట్టి చంపి పెట్రోల్ పోసి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేయగా చేతన్ తాను హత్య చేసిన విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అనుమానాస్పదంగా మృతి చెందిన యువతి మిస్టరీని పోలీసులు చేధించారు.