సాక్షి,బళ్లారి: గత 15 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరు జల్లులతో కూడిన వర్షం, కమ్ముకున్న కారుమబ్బులతో, పంటకు సూర్యభగవానుడి ప్రతాపం దూరంమై జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు, సాగు చేసిన పంటలు చేతికందుతాయో లేదో అన్న భయాందోళన వెంటాడుతోందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో తుంగభద్ర డ్యాం కూడా నిండుకుండలా తొణికిసలాడుతుండటం వల్ల తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రైతులు సకాలంలో పంటలు సాగు చేశారు. వరినాట్లతో పాటు ప్రధానంగా మిర్చి పంట కూడా సాగు చేశారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో తుంగభద్ర ఆయకట్టు కింద బళ్లారి, కంప్లి, సిరుగుప్ప, హొసపేటె నియోజకవర్గాల పరిధిలో దాదాపు ఒకటిన్నర లక్షల ఎకరాలకు పైగా మిర్చి నాట్లు వేయగా, అందులో దాదాపు 40 శాతం పైగా మిర్చి నాట్లు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందారు.
ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడి
బళ్లారి తాలూకా శంకరబండకు చెందిన మిర్చి రైతు ఎర్రిస్వామి సాక్షితో మాట్లాడుతూ తాను 20 ఎకరాల్లో మిర్చినాటానన్నారు. ఒక్కో మిర్చినారు ఒక రూపాయి చొప్పున ఒక ఎకరాకు 20 వేలకు పైగా మిర్చినారుకు, నాట్లు వేయడానికి ఇతర ఖర్చులు దాదాపు రూ.10 వేలు, సేద్యం పనులకు మరో రూ.5 వేలు చొప్పున ఖర్చు చేశానన్నారు. ఇప్పటికే మిర్చి నాట్లు వేసి 15 నుంచి 20 రోజులైందన్నారు. ఎకరాకు దాదాపు రూ.40 వేలకు పైగా ఖర్చు చేశానన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మిర్చిపైరు నాటిన తర్వాత వేరులో పురుగులు రావడంతో పాటు కుళ్లిపోతున్నాయన్నారు. వర్షాలు ఆగిపోయిన తర్వాత కుళ్లిన నారు స్థానంలో మళ్లీ నాటక తప్పదని అన్నారు. ఇలా జిల్లాలో మిర్చినాటిన ప్రతి రైతు కన్నీటి వ్యధ ఉంది. వర్షాలు కురస్తుండటం, చల్లని వాతావరణానికి నారు కుళ్లిపోతోందని, పైరు ఏపుగా పెరగకుండా, ఆకుపచ్చగా ఉండాల్సిన మొక్క ఎర్రబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చినాటడానికి అష్టకష్టాలు పడ్డామని, ఇతర ప్రాంతాల్లోని నర్సరీల్లో నుంచి మిర్చినారు తెచ్చి, నాట్లు వేశామన్నారు.
మిర్చినారు కుళ్లిన చోట కనిపిస్తున్న ఖాళీ భూమి
కుళ్లిపోయిన మిర్చివేర్లను చూపుతున్న రైతు
ఒక ఎకరాకు రూ.30 వేలకు పైగా నష్టం
మిర్చినారు కుళ్లుతున్నట్లు రైతుల ఆవేదన
నిరంతరాయ వర్షాలతో తీవ్ర నష్టాలు
నాటిన రోజు నుంచి వర్షం చిరు జల్లులతో మొదలై నిరంతరాయంగా కురవడం వల్ల తీవ్ర నష్టాలు ఏర్పడే అవకాశాలున్నాయని మిర్చి రైతులు అంటున్నారు. గత మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులు ఏదో రకంగా నష్టపోతున్నారని, గిట్టుబాటు ధర లేక ఇప్పటికీ ఎంతో మంది రైతుల ఉత్పత్తులు కోల్డ్‌స్టోరేజీల్లో ఉంచి అప్పులు పాలైన నేపథ్యంలో గోరుచుట్టుపై రోకటి పోటులా, ఆదిలోనే హంసపాదు అన్న చందంగా పరిస్థితి మారిందంటున్నారు. మిర్చినాట్లు వేసిన తర్వాత నిరంతరాయంగా వర్షాలు కురవడంతో ఈ ఏడాది కూడా మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని వాపోతున్నారు. మిర్చినాట్లు కుళ్లిపోయి, ఎర్రబారిపోవడంతో అక్కడక్కడ నారును పీకేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కుళ్లిన మిర్చి మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలంటే మళ్లీ రెట్టింపు పెట్టుబడి అవుతుందని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఓ వైపు రోగాల బెడద, మరో వైపు నాటిన మిర్చి మొక్క పెరగకుండా వర్షం దెబ్బకు కుళ్లిపోవడంతో ప్రారంభంలోనే మిర్చి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్న తరుణంలో మిర్చి సాగు చేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎడతెగని వర్షం.. మిరపకు నష్టం