
ఏ తల్లి కన్నబిడ్డో.!
● రోడ్డు పక్కనే పసికందు లభ్యం
రాయచూరు రూరల్ : ఏ తల్లి కన్నబిడ్డో కాని రోడ్డు పక్కనే పసికందును వదిలివెళ్లిన ఘటన తాలూకాలోని కల్మల గ్రామంలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం వాహ్యాళికి వెళ్లిన గ్రామస్తులకు ఈ పసికందు లభించింది. రోడ్డు పక్కన వదిలి వెళ్లిన చిన్నారి రోదిస్తుండగా గమనించిన పాదచారులు పసికందును తీసుకొచ్చి ఆరోగ్య కేంద్రంలో అప్పగించారు. సమాచారం అందగానే గ్రామీణ పోలీసులు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో ఎస్‌ఐ మృతి
హొసపేటె: రాజస్థాన్‌లో విధులకు వెళ్లిన హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హాలప్ప బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన ఈనెల 17న హొసపేటె నుంచి రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ విధుల్లో ఉండగా ఆకస్మికంగా ఛాతీలో నొప్పి వచ్చింది. అతనిని వెంట ఉన్న పోలీస్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఉత్తమ సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
సంచార జాతుల
అభివృద్ధే లక్ష్యం
హొసపేటె: సంచార గిరిజన వర్గాలను సామాజిక, విద్యా, రాజకీయ, వృత్తిపరంగా ముందంజలోకి తీసుకురావడమే ధ్యేయం అని రాష్ట్ర సంచార వర్గాల అభివృద్ధి మండలి అధ్యక్షురాలు పల్లవి తెలిపారు. కన్నడ విశ్వవిద్యాలయంలోని పంపా ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మొట్టమొదటి సంచార, సెమీ సంచార అభివృద్ధి సంస్థ కర్ణాటకలో స్థాపితమైందన్నారు. ఈ వర్గాల సర్వతోముఖాభివృద్ధే కార్పొరేషన్ లక్ష్యం అన్నారు. గుడిసెలు, గుడారాలలో నివసించే సంచార, పేద వర్గాలకు శాశ్వత ఇళ్లు కల్పించాలన్నారు. గుడారాలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే కార్పొరేషన్ ప్రాధాన్యత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 26 తాలూకాలోని సంచార, గిరిజనుల స్థావరాలను సందర్శించిన తర్వాత చాలా సంచార వర్గాలకు ఓటరు గుర్తింపు కార్డులు వంటి అసలు పత్రాలు లేవని తాను తెలుసుకున్నానని ఆమె అన్నారు. ముందుగా వారికి అసలు పత్రాలను అందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం సంచార వర్గాలకు అందించే పథకాల ప్రయోజనాలను లబ్దిదారులకు నేరుగా అందించడానికి ఆన్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కన్నడ విశ్వవిద్యాలయ గిరిజన అధ్యయన విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్.ప్రభాకర్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కేఎం.మైత్రి, డాక్టర్ మాధవ పెరాజే పాల్గొన్నారు.
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
● మాన్వి సీఐ మెరుపు దాడులు
● 14 ఇసుక టిప్పర్లు స్వాధీనం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కొరడా ఝళిపించారు. తుంగభద్ర, కృష్ణా నదీ తీర ప్రాంతాల నుంచి రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు దాడి జరిపారు. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ తాలూకాల్లో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణా అరికట్టే దిశలో మాన్వి సీఐ కెంచరెడ్డి సోమవారం దాడి జరిపి 14 టిప్పర్లు, హిటాచీలను స్వాధీనం చేసుకున్నారు. స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగచాటుగా తరలించి నిల్వ చేసుకునేందుకు నదిలో యంత్రాలతో భారీగా గోతులు పడేలా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రెండు ట్రిప్పులకు రాయల్టీని పొంది మిగిలిన వాహనాలకు లేకుండా తరలిస్తున్న వందలాది టన్నులను ఇసుక టిప్పర్లను స్వాధీన పరుచుకున్నారు. మాన్వి తాలూకా మద్లాపుర వద్ద తుంగభద్ర నదీ తీరంలో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా సీఐ కెంచరెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఏ తల్లి కన్నబిడ్డో.!

ఏ తల్లి కన్నబిడ్డో.!

ఏ తల్లి కన్నబిడ్డో.!