కాంగ్రెస్‌ పార్టీలో మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలు..! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీలో మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలు..!

Published Tue, Dec 26 2023 1:42 AM

- - Sakshi

కర్ణాటక: అధికార కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ బహుళ ఉప ముఖ్యమంత్రుల నియామకం కలకలం చెలరేగింది. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రజాపనుల శాఖామంత్రి సతీశ్‌ జార్కిహొళి నేతృత్వంలో కొందరు నేతలు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడానికి ఎస్సీ, ఎస్టీ వర్గాలు, లింగాయత సముదాయాలకు చెందిన ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా చేయాలని కొందరు సీనియర్లు పట్టుబడుతున్నారు.

గతంలో మంత్రి కేఎన్‌.రాజణ్ణతో పాటు పలువురు మంత్రులు ఈ విషయమై గట్టిగా మాట్లాడారు. రచ్చ అవుతుందని అనుకున్న హైకమాండ్‌ దీనిపై ఎవరూ బహిరంగంగా మాట్లాడరాదని హుకుం జారీచేసింది. దీంతో కొన్నాళ్లు డిప్యూటీ సీఎంల గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ మొదలైంది.

ఓట్ల పేరుతో డిమాండ్‌
కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌లను జార్కిహొళి, ఆయన బృందం కలుస్తారు. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని గట్టిగా కోరనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ముఖ్యమైన మూడు కులాల నేతలకు ఆ పదవులిస్తే లోక్‌సభ ఎన్నికల్లో దండిగా ఓట్లు రాబట్టవచ్చని వాదన వినిపించే అవకాశముంది.

డీకే శివకుమార్‌కు చెక్‌ పెట్టే యత్నం
ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి స్థానం కావాలని పట్టుబట్టిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌.. చివరకు డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించారు. అయితే తనను తప్ప ఎవరిని డిప్యూటీ సీఎం చేయరాదని ఆయన హైకమాండ్‌కు షరతు విధించారు. బెళగావి రాజకీయాల్లో డీకే.శివకుమార్‌ జోక్యం పెరిగిపోయిందని కోపోద్రిక్తుడైన సతీశ్‌ జార్కిహొళి.. డీకేశికి అడ్డుకట్టవేయాలని ముగ్గురు డీసీఎంల ప్రస్తావన తెచ్చారు. దీంతో డీకే జోరుకు బ్రేక్‌ వేయవచ్చునని జార్కిహొళితో పాటు సీఎం సిద్దరామయ్య వర్గం నేతలు భావిస్తున్నారు.

Advertisement
Advertisement