కర్మాగారాల కాలుష్యం అరికట్టండి
హొసపేటె: మరియమ్మనహళ్లి, హగరిబొమ్మనహళ్లి చుట్టు పక్కల ఉన్న కర్మాగారాల నుంచి వెలువడే దుమ్ముతో వేలాది ఎకరాల భూమి సాగుకు పనికి రాకుండా పోయిందని, జిల్లా యంత్రాంగం ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక రైతు సంఘం, గ్రీన్ సేనె హుచ్చవనహళ్లి (మంజునాథ వర్గం) డిమాండ్ చేశాయి. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.పరశురామప్ప మాట్లాడుతూ మరియమ్మనహళ్లి సమీపంలోని బీఎంఎం, హగరిబొమ్మనహళ్లి సమీపంలోని ప్రగతి స్టీల్స్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే దుమ్ముతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. మరియమ్మనహళ్లి చుట్టు పక్కల ఉన్న హనుమనహళ్లి, వెంకటాపుర, వ్యాసనకెరెల వద్ద దాదాపు 980 ఎకరాల్లో పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా హగరిబొమ్మనహళ్లిలో కూడా ఇలాంటి సమస్య తలెత్తిందన్నారు. కర్మాగారాల నుంచి వెలువడే తీవ్రమైన దుమ్ము వేరుశెనగ, మొక్కజొన్న తదితర పంటలపై పేరుకు పోయి పంటలుదెబ్బ తింటున్నాయని తెలిపారు. దీంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అయితే ఈ కర్మాగారాలు రైతుల గురించి అసలు పట్టించుకోనట్లు కనిపిస్తోందన్నారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి ఎకరానికి రూ.2 వేల పరిహారం ఇవ్వాలి. విజయనగర జిల్లాలో సత్వరం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలి. పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలి. లేకుంటే భారీ పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు బణకార్ బసవరాజ్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తాలూకా అధ్యక్షుడు షేకప్ప నాగప్ప, హెచ్.పరశురామ, సీ.నాగరాజ్ పాల్గొన్నారు.
కాలుష్య కారక పరిశ్రమలు వద్దు
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో బల్డోటా, టాటా ఇస్పాత్ తదితర ప్రైవేట్ కంపెనీలు, నూతన పరిశ్రమల స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కొప్పళ జిల్లా రైతులు డిమాండ్ చేశారు. గురువారం నగరసభ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆందోళనకారుడు బసవప్రభు బెట్టదూరు మాట్లాడారు. దక్షిణ కర్ణాటకలో నెలకొల్పాల్సిన పరిశ్రమలను రైతులు అడ్డుకోవడంతో ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం తగదన్నారు. ఆ పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే పర్యావరణ వాతావరణం నాశనం కావడమే కాకుండా చిన్న పిల్లలకు, మానవులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ఆరోపించారు. అలాంటి కాలుష్య కారక పరిశ్రమలను నెలకొల్పకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.
క్రీడా పోటీల్లో రాణించాలి
రాయచూరు రూరల్: క్రీడా పోటీల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాణించాలని ఏడీసీ శివానంద పేర్కొన్నారు. గురువారం మహాత్మా గాంధీ క్రీడాంగణంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా క్రీడా శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాయచూరు జిల్లా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణతో పాటు సామాజిక పరిజ్ఞానంతో క్రీడల్లో రాణించాలని కోరారు. కేవలం పేరుకు మాత్రమే క్రీడల్లో పాల్గొన్నామంటే సరిపోదన్నారు. జిల్లా ఉత్సవాలకు మెరుగులు దిద్దాలన్నారు. రాయచూరు జిల్లా నుంచి 21 మంది ప్రభుత్వ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ముదావహం అన్నారు. కృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, శంకరగౌడ, వీరేష్ నాయక్ పాల్గొన్నారు.
కర్మాగారాల కాలుష్యం అరికట్టండి
కర్మాగారాల కాలుష్యం అరికట్టండి


