ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభం
హుబ్లీ: హుబ్లీ నుంచి హైదరాబాద్, షోలాపూర్, శక్తినగరకు ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ డీసీ హెచ్.రామనగౌడర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల అనుకూలం కోసం ఈ మూడు నగరాలకు గోకుల్ రోడ్డు కేంద్ర బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి రోజూ హైదరాబాద్‌కు బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరి గదగ్, కొప్పళ, గంగావతి, సింధనూరు, రాయచూరు, మహబూబ్ నగర్ గుండా హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌కు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో అదే బస్సు అక్కడ నుంచి సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి ఉదయం రోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ప్రమాద పరిహార బీమా, టోల్ ఫ్రీతో పాటు ప్రయాణ ధర హైదరాబాద్‌కు రూ.790, అలాగే రాయచూరుకు రూ.408గా టికెట్ ధర నిర్ణయించారు. అలాగే గోకుల్ రోడ్డు బస్టాండ్ నుంచి షోలాపూర్‌కు రాత్రి 8.30 గంటలకు బయలుదేరే బస్సు ధార్వాడ, సౌదత్తి, రామదుర్గ, లోకాపుర, ముధోళ, జమఖండి, విజయపుర మీదుగా మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి రాత్రి 8.30 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వచ్చే ఈ బస్సులో ప్రయాణ ధర రూ.491గా నిర్ణయించారు. అలాగే శక్తినగర్‌కు రాత్రి 10 గంటలకు బయలుదేరే బస్సు గదగ్, కొప్పళ, గంగావతి, సింధనూరు, రాయచూరు మీదుగా శక్తినగర్‌కు మరుసటి రోజు 5.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ తిరిగి రాత్రి 8 గంటలకు బయలుదేరి హుబ్లీకి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. దీనికి కూడా ప్రమాద బీమా, టోల్‌ఫ్రీతో కలిపి రాయచూరుకు రూ.408 అలాగే శక్తినగర్‌కు రూ.441గా టికెట్ ధర నిర్ణయించారు. ఆన్‌లైన్, అడ్వాన్స్ బుకింగ్ ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి నాలుగు సీట్ల కన్నా ఎక్కువ రిజర్వు చేస్తే 5 శాతం రాయితీ, అలాగే వచ్చి పోయే ప్రయాణానికి ఒకేసారి కొంటే ప్రయాణ ధరలో 10 శాతం రాయితీ ఇస్తారని తెలిపారు. మొత్తానికి ప్రయాణీకుల రద్దీ, స్పందన చూసి ప్రముఖ స్థలాలకు ఇలాంటి మరిన్ని బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు.


