కష్టాల సుడిలో మొక్కజొన్న రైతన్న
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ఎందుకు డిమాండ్ చేశామో, ఆందోళన ఎందుకు చేశామో తమకు అర్థం కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలను ప్రతి క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రూ.2400ల కనిష్ట ధర, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్వింటాల్‌కు రూ.600 ప్రోత్సాహధనం కోసం జిల్లాతో పాటు వివిధ చోట్ల ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో రైతు నుంచి 100 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే హావేరి జిల్లాధికారి కార్యాలయం ఎదుట సమస్యల సాధన కోసం ఆందోళన చేపట్టిన రైతుల సమస్యలపై తొలుత ప్రభుత్వం స్పందించలేదు. పోరాటం తీవ్రతరం కావడంతో ఆ మేరకు మొక్కజొన్నలకు క్వింటాల్‌కు రూ.2400ల మద్దతు ధర నిర్ణయించింది. 12 క్వింటాళ్ల మొక్కజొన్నను ప్రతి రైతు వద్ద నుంచి కొనుగోలు చేయాలని సూచించింది. అయినా రైతన్నలు మాత్రం తమ పోరాటానికి స్వస్తి పలకలేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వంతో ప్రకటింపజేశారు.
ప్రభుత్వ హామీతో ఆందోళన విరమణ
అయినా కూడా రైతులు శాంతించక తమ ఆందోళన కొనసాగించారు. దీంతో ఎట్టకేలకు ప్రతి రైతు నుంచి 50 క్వింటాళ్ల మేర కొనుగోలుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు తమ ఆందోళనను ఉపసంహరించుకున్నారు. ఇన్ని పోరాటాలు చేసి పట్టు సాధించినా కూడా తమకు ఎటువంటి లాభం కలగలేదని రైతులు అసంతృప్తి వెళ్లగక్కారు. రైతుల ఆందోళన కంటే ముందే మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1600 నుంచి రూ.1800 ధర ఉండేది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటనతో మొక్కజొన్నకు కొద్ది మేర డిమాండ్ పలికింది. వ్యాపారులు రూ.2000 వరకు క్వింటాల్‌కు చెల్లించారు. అయితే ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2400 ధర చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వ్యాపారులకు మొక్కజొన్న విక్రయించలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలుకు వీలుగా రైతుల పేర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతోటే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రతి రైతు నుంచి కేవలం 20 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసేలా పేర్లు నమోదు చేసుకున్నారు.
హావేరి జిల్లా రైతన్నకు తప్పని నష్టాలు
సర్కారుతో పోరాడినా ఫలితం అంతంతే
రైతుల నుంచి మొక్కజొన్న శాంపిళ్లను సేకరించారు. అయితే సదరు శాంపిళ్ల ఫలితాలు వెల్లడించలేదు. ఫలితంగా రైతులు చకోర పక్షుల్లా పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు హావేరి కేఎంఎఫ్ కార్యాలయ ఆవరణలో పేర్లు నమోదు చేసిన రైతులు ధార్వాడ, శికారిపురకు మొక్కజొన్న పంటను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహన బాడుగలు చెల్లించి అక్కడికి తీసుకెళ్లిన రైతులకు వాటి విక్రయానికి వారాలు పట్టింది. దీంతో వాహనాలకు అద్దె, డ్రైవర్ల భత్యం తదితరాలతో రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చినా కూడా ఫలితం దక్కలేదు. పైగా మొక్కజొన్నకు తెగులు ఆశించింది. అలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా ఖరీఫ్ ముగిసిన వెంటనే మొక్కజొన్న పంటను విక్రయించి ఉంటే తమకు ఈ పరిస్థితి దాపురించేది కాదని రాష్ట్రంలో అత్యధికంగా మొక్కజొన్నలు పండించే హావేరి జిల్లా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టాల సుడిలో మొక్కజొన్న రైతన్న


