జిల్లా ఎస్పీగా సుమన బాధ్యతల స్వీకారం
సాక్షి,బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద జరిగిన రగడ, కాల్పుల నేపథ్యంలో ఓ యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘర్షణను నివారించడంలో జిల్లా ఎస్పీ పవన్ నెజ్జూర్ నిర్లక్ష్యం వహించారనే కారణంలో ఆయన్ను ప్రభుత్వం ఏకంగా సస్పెండ్ చేయడంతో రాష్ట్రంలోని పోలీసు వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోను చర్చనీయాంశంగా మారింది. జనవరి 2వ తేదీ నుంచి బళ్లారి జిల్లాకు చిత్రదుర్గ జిల్లా ఎస్పీ రంజిత్‌కుమార్ బండారిని ఇన్‌ఛార్జిగా నియమించారు. వారం రోజులుగా రంజిత్‌కుమార్ జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై దృష్టి సారించారు. నూతన ఎస్పీగా నియమితులైన సుమన పన్నేకర్ గురువారం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో రంజిత్ కుమార్ బండారి నుంచి బాధ్యతలు స్వీకరించడంతో ఆయన లాఠీని అందజేశారు.
పోలీసు అధికారులతో కొత్త ఎస్పీ సమీక్ష
అనంతరం ఆమె జిల్లాలోని పలువురు పోలీసు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో శాంతిభద్రతల పర్యవేక్షణపై చర్చించారు. నగరంలో గత వారం రోజుల నుంచి టెన్షన్ వాతావరణం ఉండటంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో రాజీ లేకుండా పని చేస్తానన్నారు. బ్యానర్ వివాదంలో ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నారా భతర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వివరాలను ఆమె సంబంధిత పోలీసు అధికారుల నుంచి తెలుసుకున్నారు. బళ్లారి డీఐజీగా పని చేసిన వర్తిక కటియార్ కూడా బదిలీ కావడంతో ఆమె స్థానంలో నియమితులైన డాక్టర్ ఎస్.పీ హర్షను కలుసుకుని చర్చించారు. డీఐజీ నేతృత్వంలో పలువురు పోలీసు అధికారులు కూడా గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద ఘర్షణ జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు.
మొదటి రోజునే విధినిర్వహణలో హడావుడి
పవన్ నెజ్జూర్‌పై వేటు నేపథ్యంలో ముందు జాగ్రత్తలు


