ఉద్యోగం ఇవ్వలేదని భవన యజమాని అక్కసు
హుబ్లీ: స్వార్థం పరిమితి దాటిపోతోంది. తాజాగా తాను అంగన్‌వాడీ కేంద్రానికి బాడుగ ఇచ్చానని, అందువల్ల తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టి ఆ ఉద్యోగానికి సహకరించలేదన్న కారణంగా సదరు అద్దె ఇంటి తలుపునకు తాళం వేసి విచిత్రంగా ప్రవర్తించిన యజమాని తీరు ఇది. వివరాలు.. ఈ ఘటన సాక్షాత్తు రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సొంత జిల్లా బెళగావిలోని రాయబాగ తాలూకా నందికోరలి గ్రామంలోని వంజేరి తోట అంగన్‌వాడీ కేంద్రంలో జరిగింది. ఆ కేంద్రానికి గత నాలుగు రోజుల నుంచి బాబురావ్ వంజేరి అనే వ్యక్తి తాళం వేశారు. దీంతో అంగన్‌వాడీ చిన్నారులు అంగన్‌వాడీ బయట ఆవరణలో కూర్చొని చదువుకోవడంతో పాటు అక్కడే భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది.
హామీ మరిచి ఇతరులకు ఉద్యోగం
సదరు కట్టడం నిర్మించి 22 ఏళ్లు దాటింది. 2000 సంవత్సరం నుంచే ఈ స్థలాన్ని ఇచ్చామని, స్థలాన్ని తీసుకున్న అధికారులు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారులు ఇచ్చిన ఆ మాటను మరచిపోయి తమ కుటుంబ సభ్యుడికి బదులుగా ఇతర వ్యక్తికి ఉద్యోగం కేటాయించారని ఆయన వివరించారు. అంగన్‌వాడీ కేంద్రం సహాయకురాలి పోస్టు ఖాళీ ఏర్పడటంతో అప్పట్లో జిల్లాధికారికి దరఖాస్తు చేశాం. అధికారులకు విన్నవిస్తే మీ కుటుంబ సభ్యులకు ఇస్తామని దరఖాస్తు వేసుకోమని సూచించారు. అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. సీడీపీఓ ఇక్కడికి వచ్చి చూస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఇటు వైపు తిరిగి చూడలేదన్నారు.
ఉద్యోగం ఇస్తేనే తాళం తీస్తా
తమ కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తే తాళం తీస్తానని ఆ భవన యజమాని బాబూరావు మొండికేశారు. సదరు కేంద్రం అంగన్‌వాడీ టీచర్ మాలతీ మఠపతి మాట్లాడుతూ ఈ అంగన్‌వాడీలో యజమాని కుటుంబ సభ్యులకు సహాయకురాలి ఉద్యోగం కావాలి, ఆయన పొలంలోనే కేంద్రం ఉండటం వల్ల తాళం వేశారు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. పిల్లలు గత నాలుగు రోజుల నుంచి బయటే ఉన్నారు. సూపర్‌వైజర్ వచ్చి పరిశీలించి వెళ్లారు. ఆమె తనను కార్యాలయానికి రావాలని సూచించడంతో తాను వెళ్లానని, రేపు వస్తానని ఆమె హామీ ఇచ్చారు. సాయంత్రం వరకు వేచి చూసినా ఆమె రాలేదని, ఉన్న స్థితిగతులను ఉన్నతాధికారులకు తెలియజేశానని అంగన్‌వాడీ కార్యకర్త వివరించారు.
త్వరలో సమస్యకు పరిష్కారం
రేపు వస్తామంటున్నారు. సీడీపీఓ అసలు రాలేదు. నేను ఓ మామూలు అంగన్‌వాడీ టీచర్‌ని, ఈ ఘటనపై ఇంతకన్నా ఎక్కువగా ఏమి చెప్పలేనన్నారు. ఈ విషయమై ఆ తాలూకా అధికారిణి భారతి ఫోన్‌లో స్పందించారు. గతంలోని అధికారులతో సదరు భవనం యజమానికి ఏం ఒప్పందం జరిగిందో తనకు తెలియదని, ఆయన విజ్ఞప్తిని రాతపూర్వకంగా ఇవ్వలేదు. గత 20 ఏళ్ల నుంచి కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం, తాళం తీయాలని విజ్ఞప్తి చేశామని, అయినా యజమాని స్పందించలేదని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చానని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భారతి తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేసిన వైనం
విధి లేక ఆరు బయటే పిల్లల విద్యాభ్యాసం


