సాక్షిప్రతినిధి,కరీంనగర్:
శాతవాహన యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదిరి పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం కరీంనగర్‌కే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా రాజధానికి చేరుకుంది. తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారంటూ ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కి శాతవాహన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ జాక్ విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ధర్మారంలో కలిశారు. అక్కడ వీసీ ఉమేశ్ కుమార్, బాటనీ పార్ట్‌టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ అక్కడ నుంచే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణాకు ఫోన్ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరగుతుందో? తెలుసుకోవాలని కోరారు. వెంటనే ఈ వ్యవహారంలో నిజనిజాలు నిర్ధారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దీనికి యోగితా రాణా సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
‘శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రొఫెసర్ సుజాత, ఇతర దళిత విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు త్వరలోనే ఎమ్మార్పీఎస్ పక్షాన ఉద్యమిస్తాం’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, ఉపాధ్యక్షుడు కనకం అంజిబాబు, సీనియర్ నాయకుడు పొత్తూరి రాజన్న, ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్ మాదిగ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
వీసీ ఉమేశ్‌కుమార్ తనను వ్యక్తిగతంగా వేధిస్తుండగా.. బాటనీ విభాగం పార్ట్‌టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తనను అర్బన్ నక్సలైటంటూ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూరేపల్లి సుజాత కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై వేసిన విచారణ కమిటీ రిపోర్టు కాపీలను కూడా పోలీసులను అందజేశారు. దీంతోపాటు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాట్సప్ గ్రూపుల్లో శాతవాహన వర్సిటీలో తనను అర్బన్ నక్సలైట్‌గా చిత్రీకరిస్తూ.. చేసిన పోస్టుల స్క్రీన్‌షాట్లు, వారి ఫోన్ నంబర్లు ఫిర్యాదుకు జతచేశారు. కొన్నిరోజులుగా దళిత మహిళా ప్రొఫెసర్‌నైన తనను అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో వేధిస్తోన్న వారిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం జరుగుతున్న తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఇంటెలిజెన్స్ పోలీసులు వివరాలు సేకరించి నివేదిక ఇచ్చారు.


