అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కమిటీ
ప్రతిపక్షాలకు ఒకటి ఇవ్వాలంటున్న కాంగ్రెస్
పోటీకి బీఆర్‌ఎస్ మాజీలు సమాయత్తం
గుర్తింపు కోసం పోటీ కావాలంటున్న కార్పొరేటర్లు
కరీంనగర్ కార్పొరేషన్: కో ఆప్షన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో నగరపాలకసంస్థ పరిధిలోని రాజకీయ పార్టీల్లో వేడి రాజుకొంటోంది. ఐదు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండడంతో, ఆ లోగా అభ్యర్థుల ఎంపికపై అధికార బీజేపీ కసరత్తు చేస్తోంది. ఐదింటిలో ప్రతిపక్షాలకు ఒకటి ఇచ్చి ఏకగ్రీవ ఎన్నిక ద్వారా కొత్త సాంప్రదాయానికి బాటలు వేయాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. పార్టీ పరంగా బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకొనప్పటికీ వ్యక్తిగతంగా పోటీచేసేందుకు ఆ పార్టీ మాజీ కార్పొరేటర్లు సమాయత్తమవుతున్నారు. పోటీ నెలకొంటేనే తమకు గుర్తింపు ఏర్పడే అవకాశం ఉండడంతో ఇతర కార్పొరేటర్లు ఎన్నికలపై ఆసక్తితో ఉన్నారు.
బీజేపీ దరఖాస్తుల స్వీకరణ
కో ఆప్షన్ పదవులు ఆశిస్తున్న వారి నుంచి బీజేపీ దరఖాస్తుల స్వీకరణ చేపడుతోంది. వచ్చిన దరఖాస్తుల నుంచి ఐదుగురిని ఎంపిక చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు తదితరులతో పార్టీ కమిటీ ఏర్పాటు చేసింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ కార్పొరేటర్లు పలువురు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీకి శుక్రవారం దరఖాస్తు చేసుకొన్నారు.
ప్రతిపక్షాలకు ఒకటివ్వాలి
కో ఆప్షన్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తోంది. ఐదు కో ఆప్షన్ సభ్యులకు గాను ఒక స్థానం ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చి, ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని అధికార బీజేపీని కోరింది. దీని ద్వారా నగరపాలకసంస్థలో మంచి సంప్రదాయానికి బాటలు వేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతిపాదన అమలుకు నోచుకోవడం అంత సులువుగా కనిపించడం లేదు. నగరపాలకసంస్థలో అధికార బీజేపీ ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉండగా, ప్రతిపక్ష పార్టీలకు ఒక స్థానం ఇవ్వడానికి ఆ పార్టీ పెద్దలు అంగీకరిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తం 69 ఓట్లకు గాను బీజేపీ ఓట్లు 34, బీజేపీయేతర ఓట్లు 35 ఉండడాన్ని కాంగ్రెస్ చూపుతోంది.
పోటీలో బీఆర్‌ఎస్ మాజీలు
కో ఆప్షన్ ఎన్నికల్లో పార్టీ పరంగా బీఆర్‌ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికి, ఆ పార్టీకి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు పోటీచేసేందుకు సిద్దపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపొందిన మాజీ కార్పొరేటర్లు ఐదు సంవత్సరాల పాటు మరోరూపంలో బల్దియాలో ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే పనిలోపడ్డారు. ఇప్పటికే వివిధ పార్టీల కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు.
పోటీ ఉంటేనే గుర్తింపు
ఐదు కోఆప్షన్ సీట్లపై అన్ని పార్టీల కార్పొరేటర్లు ఆసక్తితో ఉన్నారు. అధికార బీజేపీకి నగరపాలకసంస్థలో అధిక బలం ఉండడంతో, ఎన్నిక ఏకపక్షం, ఏకగ్రీవమే అని బీజేపీ చెబుతోంది. ఏకగ్రీవం కా కుండా పోటీ ఏర్పడితేనే తమకు గుర్తింపు లభి స్తుందని కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఎక్స్‌అఫిషి యో సభ్యులతో సహా బీజేపీ ఓట్ల కన్నా బీజేపీయేతర ఓట్లు అధికంగా ఉండడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా కో ఆప్షన్ ఎన్నికలు రావడంతో ఆయా పార్టీల్లో సందడి మొదలైంది.


