చనిపోయిన కానిస్టేబుళ్ల జీతాలు స్వాహా
నకిలీ అకౌంట్ల ద్వారా రూ.1.40కోట్లు గోల్‌మాల్
కీలక నిందితులుగా హెడ్‌కానిస్టేబుల్ రాంమోహన్, ఏవో మునిరామయ్య
ఐదుగురి అరెస్టు.. వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: అవును కరీంనగర్ పోలీసుశాఖలో దొంగలు పడ్డారు. కంచే చేను మేసినట్లు చనిపోయి న తోటి ఉద్యోగుల జీతాలు స్వాహా చేశారు. ప్రజ లను రక్షించాల్సిన వారు భక్షక భటులుగా మారి అక్రమార్జనకు తెగపడ్డారు. సొంతశాఖకే కన్నం వేస్తూ.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు. చనిపోయిన వారిస్థానంలో ఇతరులకు నెలనెలా జీతాలు ముట్టజెప్పుతూ రూ.కోట్లు గడించారు. బండారం బయటపడి కటకటాల్లోకి వెళ్లారు. ప్రజలకు న్యా యం చేయాల్సిన పోలీసులే దొంగలుగా మారి సొంతశాఖకే కన్నం వేయడం చర్చనీయాంశమైంది.
రూ.1,40,18,308 కోట్లు స్వాహా
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జీతాల కుంభకోణం కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చూపారు. పోలీస్‌శాఖలో గతంలో మరణించిన ఉద్యోగుల స్థానంలో ఇతరుల పేరిట నకిలీ అకౌంట్లు తీసి, రూ.1,40,18,308 దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వాసాల సతీశ్ ఫిర్యాదుతో కరీంనగర్ వన్‌టౌన్‌లో కేసు నమోదుకాగా, ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు.
ప్రైవేటు వ్యక్తుల పేరిట
ప్రస్తుతం చిగురుమామిడిలో పనిచేస్తున్న హెడ్‌కాని స్టేబుల్ నీలం రామ్మోహన్(52) గతంలో కమిషనరేట్ సీపీవో కార్యాలయంలోని పే సెక్షన్‌లో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో మరణించిన కాని స్టేబుళ్లు సీహెచ్.రవీందర్, కె.గంగస్వామి, కె.రవి ఎంప్లాయీ ఐడీలు సేకరించాడు. సదరు ఉద్యోగుల పోర్టల్‌లో నగరానికి చెందిన ప్రైవేటు వ్యక్తులైన లావుడ్య రవి(42), చుక్క గంగరాజు(33), శంకర్ నామతాబాబ్(44) పేర్లు నమోదు చేసి, కరీంనగర్‌లోని భగత్‌నగర్, బొమ్మకల్ హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌లో ఖాతాలు తీశాడు. ఈ ఖాతాలకు తన సొంత ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ లింక్ చేశాడు. జూన్ 2022 నుంచి మార్చి 2026 వరకు ప్రతినెలా కానిస్టేబుళ్ల జీతాలు ఆయా ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయా ఖాతాలపై బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడు. ఇందుకు రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైవీ.ముని రామయ్య(61) సహకారం తీసుకున్నాడు. ఆ సొమ్మును తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకుని, సొంతానికి వాడుకుంటూ ఈఎంఐలు సైతం చెల్లించాడు.
జీతాలపై సీపీ ఫోకస్‌తో..
ఇటీవల జీతాల చెల్లింపుల్లో అనుమానాస్పద లావాదేవీలను గమనించిన సీపీ గౌస్ ఆలం సమగ్ర విచారణ చేపట్టాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వాసాల సతీశ్‌ను ఆదేశించారు. విచారణలో రికార్డులు తారుమారు చేసి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ప్రధాన సూత్రధారి హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్, రిటైర్డ్ ఏవో వైవీ.మునిరామయ్య, లావుడ్య రవి, చుక్కా గంగరాజు, శంకర్ నామతాబాబ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీపీ తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.


