కరీంనగర్ అర్బన్: జనగణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్, విలేజ్ మ్యాప్స్ ఫైనలైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. 150– 200 ఇండ్ల వరకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించాలని, 800 ఇండ్లకు ఒక బ్లాక్‌గా విభజించాలన్నారు. సదరు ప్రక్రియపై ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు తగిన శిక్షణ అందించాలన్నారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు సాగుతుందన్నారు. సెన్సెస్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు, అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేశ్ బాబు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాల్సిందే
ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, లే అవుట్లకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, విద్యుత్‌శాఖ, టౌన్ ప్లానింగ్, ల్యాండ్స్ అండ్ సర్వే, నీటిపారుదల శాఖ తదితర శాఖల అధికారులతో లేఅవుట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో లే అవుట్ అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. పది ఎకరాల లే అవుట్‌కు కలెక్టరే అనుమతులు మంజూరు చేస్తారని.. అంతకు మించి పెరిగితే టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ హైదరాబాద్ అనుమతులు జారీ చేస్తారని అధికారులు వివరించారు.
సకల వర్గాలకు సముచిత స్థానం
సకల వర్గాలకు సముచిత స్థానమిస్తూ బ్యాంకు మరింత పురోగతి సాధించాలని కేడీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి, కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం స్థానిక కేడీసీసీ బ్యాంకును సందర్శించారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఉద్యోగుల కృషిని ప్రశంసించి, ఆర్థిక ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు నిర్ణయించిన రూ.10వేల కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించేందుకు సంఘటితంగా సాగాలని అన్నారు. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, జనరల్ మేనేజర్లు శ్రీధర్, రియాజోద్దీన్ పాల్గొన్నారు.


